తగ్గిన ఇసుక మోత!
• క్యూబిక్ మీటర్‌పై ఉన్న రూ.560 రుసుము తొలగింపు
• నీటిపారుదల-మైనింగ్ శాఖల మధ్య అవగాహన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఇసుక భారం తగ్గనుంది. ఇసుకను నేరుగా నీటిపారుదల శాఖే తీసుకునేలా వెసులుబాటు ఇవ్వడం, గతంలో విధించిన రుసుమును ఇప్పుడు పూర్తిగా ఎత్తివేయడంతో ప్రాజెక్టుల వ్యయం తగ్గుతోంది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన సమీక్ష సందర్భంగా నీటి పారుదల, మైనింగ్ శాఖల మధ్య అవగాహన కుదిరింది. అయితే నీటిపారుదల శాఖ సీనరే జీ చార్జీలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.
భారీగా ఇసుక అవసరాలు
ప్రస్తుతం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు మొత్తంగా 1.87 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరాలు ఉన్నాయి. గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను సమకూర్చుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కాంట్రాక్టర్లపైనే ఉండేది. మైనింగ్ శాఖ ఇసుక క్వారీలను గుర్తించి కలెక్టర్‌కు నివేదించేది. దానికి అనుగుణంగా కలెక్టర్ క్వారీల కేటాయింపు చేసేవారు. ఈ ప్రక్రియకు నెలల తరబడి సమయం పడుతుండడం, రీచ్‌లు కేటాయించినా వాటిలో తగినంత ఇసుక లభ్యతగా లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. దీనికితోడు క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.560 రుసుముగా నీటి పారుదల శాఖ నుంచి మైనింగ్ శాఖ వసూలు చేసేది. అదనంగా రూ.40 చొప్పున సీనరేజీ చార్జీలు వసూలు చేసేవారు. వీటిని నీటి పారుదలశాఖ ప్రాజెక్టు వ్యయాల్లోనే చూపేది. దీంతో ఒక్కో ప్రాజెక్టుకు ఇసుక కోసం వందల కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చేది.
పాలసీలో సవరణలతో..
తాజాగా ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఇసుకను రిజర్వాయర్ల నుంచి నీటి పారుదల శాఖ సొంతంగా వెలికితీసి వినియోగించుకునేలా రాష్ట్ర ఇసుక పాలసీలో సవరణలు చేశారు. నీటిపారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇసుక మేటలను గుర్తించిన తర్వాత.. మైనింగ్ ఏడీ, ఇరిగేషన్ ఈఈలు సంయుక్తంగా హద్దులను నిర్ణయిస్తారు. అలా లభించే ఇసుక పరిమాణం లెక్కించి.. జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఆమోదానికి పంపుతారు.
ఇక ఇసుక వెలికితీతలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా ట్రక్కులకు జీపీఎస్ అమర్చడం, పరిమాణానికి అనుగుణంగా సీనరేజీ చార్జీలను మైనింగ్ విభాగానికి చెల్లించాల్సిన బాధ్యతలను ఇరిగేషన్ ఈఈకి అప్పగించాలని నిర్ణయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాంతాల్లో ఏకంగా 22 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని మైనింగ్ శాఖ గుర్తించింది. ఆ ఇసుకను కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాలకు వాడాలని నిర్ణయించారు