నీళ్లు ప్రవహిస్తున్నాయ్‌.. బీళ్లు చివురిస్తున్నాయ్‌ | Telangana Well Developed In Irrigation Says Harish Rao | Sakshi
Sakshi News home page

నీళ్లు ప్రవహిస్తున్నాయ్‌.. బీళ్లు చివురిస్తున్నాయ్‌

Published Sun, Sep 2 2018 5:21 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

Telangana Well Developed In Irrigation Says Harish Rao

ఈ నాలుగేండ్లలో కేసీఆర్‌ నేతృత్వంలో తీసుకున్న చర్యలవల్ల తెలంగాణ  కోటి ఎకరాల మాగాణంగా మారడానికి మరెంతో కాలం పట్టదు. నాలుగేళ్ల మా శాఖ ప్రగతిని, కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల పాలనతో పోల్చితే తప్ప వాస్తవాలు అర్థం కావు. గత పాలకుల హయాంలో పెట్టిన ఖర్చు, సాధించిన ప్రగతి పోల్చుకుంటే వాస్తవం తెలుస్తుంది. మా చిత్తశుద్ధి ఏమిటో అందరికీ అర్థం అవుతుంది. కాలం నీటి ప్రవాహం లాంటిది. అది ఎక్కడా స్థిరంగా ఆగిపోదు. ఆ ప్రవాహం మాదిరి కదిలే కాలంతో పాటే మనం ఎన్నో పనులు పూర్తి చేయగలిగాం. దేశంలో మరే రాష్ట్రం పోటీ పడని రీతిలో సాగునీటి రంగంలో అద్భుత ప్రక్రియలకు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో వస్తోన్న ప్రశంసలే మా శాఖ పని తీరుకు గీటురాయి.

నీళ్లు, నిధులు, నియామ కాలు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న తెలం గాణ రాష్ట్రం ఉద్యమ నాయ కుడు కేసీఆర్‌ నేతృత్వంలో నాలుగేండ్లు నడిచింది. ఈ నాలుగేండ్లలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి నీళ్ల మంత్రిగా నాకు సంతృప్తిని మిగి ల్చింది. ఇంకా సాధించవలసింది ఎంతో ఉన్నా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మార్పు స్పష్టంగా కనబడుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పగ్గాలు చేపట్టిన తక్షణమే ఉద్యమ ఆకాంక్ష అయిన సాగునీటి రంగంపై దృష్టి సారించింది. అందుబాటులో ఉన్న అన్ని వనరుల ద్వారా గ్రామీణ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు చొప్పున మొత్తంగా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడమే ధ్యేయంగా ప్రణాళికలు తయారు చేసుకు న్నది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నాలుగంచెల వ్యూహాన్ని అను సరించింది. తెలంగాణ గ్రామీణ సామాజిక, ఆర్థిక వ్యవస్థకు ఆధా రాలుగా ఉన్న 46,500 చెరువులను దశలవారీగా పునరుద్దరించడం, గత ప్రభుత్వాలు ప్రారంభించి అనేక కారణాల వల్ల పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడంతో పాటు వాటిలో కొన్నింటిని తెలంగాణ  అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్‌ చేసుకుని పూర్తి చేసుకోవడం, గత ప్రభుత్వాలు ఆమోదించి అట కెక్కించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించడం, గత ప్రభుత్వాల కాలంలో నిధులు లేక, నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురయి శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టుల కాలువల వ్యవ స్థను ఆధునీకీకరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్లింది.

ఈ నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేయడానికి ఉద్యమ నాయకుడి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నాలుగేండ్ల కాలంలో శాయశక్తులా ప్రయత్నించింది. మెరుగైన ఫలితాలను సాధించింది కూడా. చెరువుల పునరుద్ధరణ కోసం ‘మిషన్‌ కాకతీయ’ పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి యేటా రాష్ట్రం లోని 20శాతం చెరువులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ అభీష్టం మేరకు కాకుండా స్థానిక ప్రజలను, ప్రజాపతిని ధులను సంప్రదించి వారికి అవసరమైన చెరువులను పునరుద్ధ రించే స్వేచ్ఛ అధికారులకిచ్చాం. చిన్ననీటిపారుదల వ్యవస్థను బలో పేతం చేశాం. అధికార వికేంద్రీకరణ, అవసరమైన వ్యవస్థల ఏర్పాటు ద్వారా టెండర్ల ప్రక్రియను 90 నుంచి 15 రోజులకు కుదిం చాం. పరిపాలనా అనుమతుల ప్రక్రియలో వేగాన్ని, ప్రజల భాగ స్వామ్యాన్ని పెంచాం. పూడిక మట్టి ఉపయోగాలపై ప్రజల్లో చైత న్యం కలిగించాం. వేలాది మంది ప్రజలు, రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా మారింది. రైతులు తమ స్వంత ఖర్చులతో పూడిక మట్టిని తరలించుకుపోయి తమ పొలాల్లో చల్లుకుని మెరుగైన దిగుబడి సాధించుకున్నారు. దీంతో రసాయనిక ఎరువులపై ఖర్చు కూడా తగ్గింది. మొదటి దశలో 8,029 చెరువుల పునరుద్ధరించి 6.73లక్షల ఎకరాలకు, రెండోదశలో 7,264 చెరువుల ద్వారా 4.29లక్షల ఎకరాలకు, మూడో దశలో 2,566 చెరువుల ద్వారా 1.45లక్షల ఎకరాలకు ఆయకట్టు అందేలా చేశాం. మొత్తం మీద మిషన్‌కాకతీయ ద్వారా 17,859 చెరువుల కింద 12.47లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఆయా చెరువుల్లో 8.20 టీఎంసీల నీటి నిల్వ పునరుద్ధరణ జరిగింది. 1.05లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతి నిధుల సహకారంతో మిషన్‌ కాకతీయ ద్వారా ఆశించిన ఫలితాలు, మార్పులు సాకారం అయ్యాయి. దీనికి తోడు 165 ఎత్తిపోతల పథ కాల కింద నాలుగేండ్లలో కొత్తగా 1.23లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించి 27వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాం.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో పడేందుకు గల కారణాలను విశ్లేషించుకున్నాం. ప్రధాన అవరోధంగా మారిన భూసేకరణ సమస్యను  ‘ల్యాండ్‌ ప్రొక్యూర్‌ మెంట్‌ పాలసీ జీవో నెం: 123 (30.07.2015) ద్వారా పరిష్కరించుకున్నాం. ఆ తర్వాత 2013 భూసేకరణ సవరణ చట్టాన్ని రూపొందించుకున్నాం. ఇది మంచి ఫలితాలనిచ్చింది. ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకుంది. రైలు, రోడ్డు శాఖల నుంచి అనుమతులు పొందడంతో మరింత ఉపశమనం లభించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న అంతర్‌రాష్ట్ర వివాదాలను మనమే చొరవ తీసుకుని పరిష్కరించడం ద్వారా ప్రాణహిత, గోదావరి, పెన్‌ గంగా నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోగలిగాం. ఈ ఒప్పంద ఫలితంగా ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద, గోదా వరిపై మేడిగడ్డ వద్ద, పెన్‌ గంగా నదిపై చనాక కొరాట వద్ద బ్యారే జీల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఈ నాలుగేండ్లలో కల్వకుర్తి, ప్రాణహిత, కాళేశ్వరం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం), పాలమూరు–రంగారెడ్డి, పెన్‌ గంగ కాలువ, చనాకకొరాట బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ లాంటి కీలక ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు సాధిం చడంలో పురోగతి సాధించాం. డిండి, సీతారామా ప్రాజెక్టుల అను మతుల ప్రక్రియ వేగం పుంజుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క సంవత్సరంలోనే 10 కీలక అనుమతులు పొందడం ఒక రికార్డు. ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని నెలలపాటు ఇంజనీరింగ్‌ నిపుణు లతో, రిటైర్డ్‌ ఇంజనీర్లతో సమావేశమై సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాపులు, గూగుల్‌ ఎర్త్‌ సాఫ్ట్‌ వేర్‌ సహాయంతో అధ్యయనం చేసిన తర్వాత ప్రాణహిత– చేవెళ్ల సుజల స్రవంతి, రాజీవ్‌ దుమ్ముగూడెం, ఇందిరా సాగర్, ఎస్సారెస్పీ వరద కాలువ, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీఇంజనీరింగ్‌ చేసుకుని పనులు చేపడుతున్నాం.ఈ నాలుగేండ్లలో మా సర్కార్‌  8 పెండింగ్‌ ప్రాజెక్టులని పూర్తి చేసింది. మరో 11 ప్రాజెక్టుల ద్వారా పాక్షికంగా నీటి సరఫరా చేయ డానికి చర్యలు తీసుకుంది. వీటి ద్వారా కొత్తగా 9.12 లక్షల ఎక రాలకు సాగునీటి సౌకర్యం  కల్పించి, మరో 2 లక్షల ఎకరాల ఆయ కట్టును స్థిరీకరించాం. పాలమూరు జిల్లాలో నాలుగు (కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌ సాగర్‌) ఎత్తిపోతల పథకాల కింద 2016–17 సంవత్సరంలో 4.5 లక్షల ఎకరాలకు, 2017–18 సంవ త్సరం రబీపంట కాలంలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి 700 పైగా  చెరువులని నింపడంతో ఆ జిల్లాలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత పంట దిగు బడి వచ్చింది. జిల్లా నుంచి వలసలు ఆగిపోయినాయి. వలసెళ్లిన వారు ఇంటిముఖం పట్టారు. మెదక్‌ జిల్లాలో సింగూరు కాలువలను పూర్తి చేసి మెదక్‌ జిల్లాలో 2017 లో 30 వేల ఎకరాలకు, 2018 రబీలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాం.

దేశానికి స్వతం త్రం వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు నుంచి మెదక్‌ జిల్లాలో నీరివ్వడం ఇదే తొలి సారి.  కరీంనగర్‌ జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాస సమస్యలను పరిష్కరించి, రాయపట్నం బ్రిడ్జ్‌ని నిర్మించి 20 టీఎంసీల పూర్తి స్థాయి నిల్వ సాధించగలిగాం. ఎత్తిపోతల నుంచి 25 వేల ఎకరాలు, చెరువులను నింపినందున మరో 37వేల ఎకరాలు స్థిరీకరణ జరిగింది. 2016లో ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లోని వందలాది చెరువులను నింపాం. ఖమ్మం జిల్లాలో 11 నెలల రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి చెరువులను నింపడం వల్ల 6 వేల ఎకరాలకు సాగునీ రిచ్చాం. డీబీఎం–60 కాలువ పనులు ఈ సంవత్సరం జూన్‌ కల్లా పూర్తి చేసి భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా 58,958 ఎకరాలకు సాగు నీరు అందించబోతున్నాం. పాలేరు పాత కాలువను 4 నెలల్లో పున రుద్దరించి 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాం.  ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే కాళేశ్వరం నీళ్లు వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీ జలాశయానికి రివర్స్‌ పంపింగ్‌ అవుతాయి. దిగువ మానేరు వరకు ఉన్న 5 లక్షల ఎకరాలకు, సరస్వతి కాలువ కింద 40 వేల ఎకరా లకు, లక్ష్మి కాలువ కింద ఉన్న 25 వేల ఎకరాలకు, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద ఉన్న లక్ష ఎకరాలకు నికరంగా నీరు అందుతుంది. మిడ్‌ మానేరు జలాశయాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి 25 టీఎంసీల నీటి నిల్వకు సిద్ధంగా ఉంచాం. మిడ్‌ మానేరు కింద మరో 70,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పంప్‌ హజ్‌ పనులు పూర్తి అయిన కారణంగా గత రబీలో అనేక చెరువు లను నింపి చెరువుల కింది ఆయకట్టును కాపాడం. ఎల్‌ఎల్‌సీ కింద 50,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో కాలువ పనులు జరుగుతున్నాయి.


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత– చేవెళ్లప్రాజెక్టు 2008 లో ప్రారంభమైనా తెలంగాణ ఏర్పడే నాటికి అటకెక్కింది. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని కూలంకషంగా సమీక్షించింది. తొలుత మహారాష్ట్రతో వివాదాలను పరిష్కరించుకునే కృషి జరిపాం. అయితే, తమ భూభాగంలో ముంపును అనుమతించలేమని, తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎ ల్‌ని 152మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించమని మహారాష్ట్ర కోరింది. అదే సమయంలో తమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని, అందులో పైరాష్ట్రాలు భవిష్యత్తులో వాడుకునే వీలున్న 63 టీఎంసీలున్నాయని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. తమ్మిడిహట్టి వద్ద నుంచి తరలించగలిగే నీటి పరిమాణాన్ని పునఃసమీక్షించుకోమని సూచించింది. జలాశ యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సిఫారసు చేసింది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరద కాలువ ఆయకట్టును స్థిరీకరించడా నికి ఈ ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ అవసరమయింది. గోదావరిపై మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు నిర్మించి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసి యెల్లంపల్లికి చేర్చడం, అక్కడి నుంచి మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసా గర్, కొండ పోచమ్మ సాగర్‌ తదితర జలాశయాలకు నీటిని తర లించి 13 జిల్లాల్లో 18.25 లక్షల కొత్త ఆయకట్టుకు, 18.80 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీరందించాలనే లక్ష్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. హైదారాబాద్‌ నగరానికి, దారి పొడవునా ఉన్న వందలాది గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరందించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ‘నభూతో నభవిష్యత్‌’ అనే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టుల్లో జరుగుతున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు కోసం కార్మికులు, ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. బ్యారేజీలు, పంప్‌హౌజ్, సర్జ్‌ఫూల్స్, టన్నెళ్లు, కాల్వలు, పైప్‌లైన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు.. ఇలా ఏకకాలంలో అనేక పనులు యుద్ధప్రాతిపదికన సాగుతు న్నాయి.ఈ ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరు జలాశ యానికి నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ కింద రెండు దశల్లోని ఆయక ట్టుకు 2018లోనే నీరిచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.


కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల కారణంగా 150 కిలోమీటర్ల మేర గోదావరి సజీవం కాబోతోంది. వ్యవసాయం, చేపల పెంప కం, టూరిజం, జలరవాణా, పరిశ్రమల స్థాపన వంటి రంగాల్లో అనూహ్యమైన ఆర్థిక ప్రగతి జరగనుంది. ఒక్క మాటలో చెప్పా లంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణాకు ‘గ్రోత్‌ ఇంజన్‌’ లాగా మార బోతున్నది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా పొందడానికి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు, సుప్రీంకోర్టు ముందు వాదనలు మా ప్రభుత్వం కొనసాగిస్తోంది. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే  పాలమూరు–రంగారెడ్డి, 4 లక్షల ఎకరాలకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా మహబూబ్‌ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని కరువు పీడిత, ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగి స్తోంది. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచింది. గత రెండేళ్లుగా రూ. 25 వేల కోట్ల మేర అత్యధికంగా నిధులు కేటాయించి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

సాగునీటి శాఖలో ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టింది. శాఖ పునర్వ్యవస్థీకరణ, కొత్త చీఫ్‌ ఇంజనీర్‌ యూనిట్ల ఏర్పాటుతో పాటు ఈపీసీ పద్ధతిని, మొబిలైజేషన్‌ అడ్వాన్సులను మా ప్రభుత్వ రద్దు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకోవడానికి నీటిపారుదల శాఖ.. ఐఐటీ, ఐఐటీహెచ్, బిట్స్, ఇస్రో, నాబార్డు, ఇక్రిశాట్‌ లాంటి ఉన్నతస్థాయి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నాలుగేండ్లలో కేసీఆర్‌ నేతృత్వంలో తీసుకున్న చర్యలవల్ల తెలంగాణ  కోటి ఎకరాల మాగాణంగా మార డానికి మరెంతో కాలం పట్టదు. నాలుగేళ్ల మా శాఖ ప్రగతిని,  కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల పాలనతో పోల్చితే తప్ప వాస్తవాలు అర్థం కావు. కాలం నీటి ప్రవాహం లాంటిది. అది ఎక్కడా స్థిరంగా ఆగి పోదు. ఆ ప్రవాహం మాదిరి కదిలే కాలంతో పాటే మనం ఎన్నో పనులు పూర్తి చేయగలిగాం. దేశంలో మరే రాష్ట్రం పోటీ పడని రీతిలో సాగునీటి రంగంలో అద్భుత ప్రక్రియలకు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో వస్తోన్న ప్రశంసలే మా శాఖ పని తీరుకు గీటురాయి.


వ్యాసకర్త సాగునీటి శాఖ మంత్రి,
తన్నీరు హరీష్‌ రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement