ఆఖరు ఆయకట్టుకు అందని సాగర్ నీరు
ప్రపంచబ్యాంక్ నిధులున్నా చేరని లక్ష్యం
22.5 లక్షల ఎకరాల ఆయకట్టులో 18.5 లక్షల ఎకరాలకే సాగునీరు
సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి రైతుకు నీరందడం ఎండమావిగానే మారుతోంది. నాగార్జునసాగర్ ఆధునీకరణ పథకం కింద ప్రపంచబ్యాంక్ కోట్ల రూపాయల నిధులు అందిస్తున్నా నిర్లక్ష్యం కారణంగా నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. వివిధ రకాల కారణాలు ప్రాజెక్టు కింది పూర్తి ఆయకట్టుకు నీరు అందించాలన్న సంకల్పానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. ప్రాజెక్టు నీటిని ఆయకట్టు మొదటి రైతులే తోడేసుకోకుండా అవగాహన నిర్వహించాలనే కార్యాచరణకు రూ.100 కోట్లు కేటాయించినా కార్యక్రమం ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు. సాగర్ కింద ఆంధ్రా ప్రాంతంలో 15 లక్షల ఎకరాలు, తెలంగాణ ప్రాంతంలో 7.5 లక్షల ఎకరాల సాగును నిర్దేశించారు. కాలువలలో పూడిక చేరడం, లీకేజీలు, ఆయకట్టు మొదట్లో పెరిగిన నీటి వినియోగం, విస్తృతమైన వరిసాగు కారణంగా నిర్దేశించిన సాగులో 18.50 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. మిగిలిన ఆయకట్టుకు నీరు చేరడం లేదు.
ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసి సాగర్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు 2010లో ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఇందుకోసం రూ. 4,444 కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 2,444 కోట్లు, బ్యాంకు వాటా 2,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కాల్వల మరమ్మతులు పోను ఈ నిధులలోనే ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ ఉత్పాదక పెంపు, పంటల మార్పిడి, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ. 95.57 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో తొలి ఆయకట్టు రైతులకు నీటి వినియోగం, పంటల మార్పిడిపై అవగాహన కల్పించాలి. నీటి అవసరాలు ఎక్కువగా ఉండే వరి పంట సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి అవసరం ఉండే మొక్కజొన్న, వేరుశనగ, పప్పుధాన్యాలు సాగును పెంచేలా ప్రోత్సాహకాలు అందించాలి. పశుగ్రాసం సాగుపై కూడా రైతులకు శిక్షణ ఇవ్వాలి. ప్రతి ఖరీఫ్, రబీ సీజన్‌కు ముందే రైతులతో సమావేశాలు ఏర్పాటుచేసేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలి. ఆ కార్యక్రమాల ద్వారా ఆయకట్టు మొదట నీటి వాడకాన్ని తగ్గించి .. చివరి ఆయకట్టుకు నీరు చేరేలా చర్యలు చేపట్టాలి. అయితే పథకం ప్రారంభమైన 2010 నుంచి ఇప్పటివరకు ఇందుకోసం కేటాయించిన రూ. 95.57 కోట్లలో కేవలం రూ.14.82 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి.
2011-12లో కరువు పరిస్థితులు, 2012-13లో వర్షాల రాక ఆలస్యం, 2013-14లో విభజన పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆశించినస్థాయిలో ముందుకుసాగలేదు.ప్రపంచ బ్యాంకు విధించిన గడువు 2016తో ముగియనుండడంతో ప్రస్తుతం అధికారులు హడావుడిగా ఈ రబీలో రైతులకు ఆవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని 5,876 మంది రైతులకు పంటల వారీగా అవగాహన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ రెండో వారం నుంచి ఇది ప్రారంభం కానుంది. అయితే 2016లోగా ప్రపంచబ్యాంక్ విధించిన లక్ష్యాలను పూర్తి చేయడం అసాధ్యమని, 2018 వరకైనా గడువు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
చివరి మడి తడిచేదెన్నడు?
Published Wed, Dec 3 2014 3:49 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement