సోనియా శకం ముగిసిందా?
భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ శకం ముగిసిందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పవచ్చు. గాంధీ, నెహ్రూ వారసత్వ రాజకీయాలను ఓసారి పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ తర్వాత డైనమిక్ పాలిటిక్స్ నడిపిన నేతల్లో సోనియా గాంధీ అలియాస్ ఎడ్విజే ఆంటానియా అల్బినా మైనోకే ఆస్థానం దక్కుతుంది. 1998 నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్ని తన కనుసైగల్లో.. దశాబ్ద కాలంపాటు ప్రభుత్వాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని నడిపించిన ఘనత సోనియాకే దక్కుతుంది.
ఇటలీ జన్మించిన సోనియా పరిస్థితుల కారణంగా భారత రాజకీయాల్లో తిరుగులేని నేతగా మారారు. ఇటాలియన్ వనిత అంటూ ప్రశ్నించిన శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నేతలే చివరికి సోనియాగాంధీ చెంతన చేరారు. భారత రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్రను పోషించిన సోనియా గాంధీకి 2014 ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. యూపీఏ-2 ప్రభుత్వ హాయంలో సోనియా తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారాయి.
అవినీతి, కుంభకోణాలు:
అవినీతి, కుంభకోణాలు, ఏకంగా తన అల్లుడు రాబర్డ్ వాద్రాపైనే అక్రమ ఆస్తుల ఆరోపణలు రావడం సోనియాను ఇరుకున పడేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించడం, ఏకపక్షంగా వ్యవహరించడంతో భారీ మూల్యానే చెల్లించకున్నారు. 2జీ టెలికాం కుంభకోణం, కామన్ వెల్త్ క్రీడలు కుంభకోణం, బొగ్గు కేటాయింపుల కుంభకోణం లాంటి అంశాలు యూపీఏ ప్రతిష్టను మసకబారేలా చేశాయి.
రాష్ట్ర విభజన:
సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్ నేతలందరూ వ్యతిరేకించినా.. తెలంగాణ ప్రాంతంలో కేవలం సీట్లు సాధించాలనే ప్రాతిపదికతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం అనేక విమర్శలకు తావిచ్చింది. విభజన ప్రభావం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా.. ఆప్రాంతంలో నామరూపాల్లేకుండా చేసుకుంది. ఇటీవల వెల్లడైన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎన్నడూ లేనంతగా దయనీయ స్థితికి చేరుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తుండటంతో కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితి కనిపిస్తోంది.
2014 ఎన్నికల తర్వాత...
ఇలాంటి నేపథ్యంలో భారత రాజకీయాల్లో సోనియా చివరి అంకం సాధారణంగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత పాలిటిక్స్ లో తెరవెనుక రాజకీయాలను ప్రభావవంతంగా నడిపిన సోనియా కన్న కలలు.. రాహుల్ ను ప్రధాని చేయాలనే కోరిక స్వప్నంగానే మిగిలే అవకాశం ఉంది. అంతేకాకుండా సోనియా గాంధీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండటం కారణంగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం కష్టమేననిపిస్తొంది. 2011లో ఆగస్టులో అమెరికాలో వైద్య చికిత్స తర్వాత గతంతో పోల్చుకుంటే రాజకీయ వ్యవహారాలకు సోనియా దూరంగానే ఉంటోంది. అధికారంలో ఉండగాన యూపీఏ భాగస్వామ్య పార్టీలు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ కు దూరమయ్యాయి. ఇక అధికారమే రాదని తెలిసిన ఎన్సీపీ నేత శరద్ పవార్ లాంటి నేతలు ఇప్పటికే ధిక్కార స్వరాన్ని ఫలితాలకు ముందే వినిపిస్తున్నారు. ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ ఒంటరిగానే మిగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
-
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సతీమణిగా రాజకీయాల్లో సుపరిచితులు
-
సంతానం: రాహుల్, ప్రియాంక గాంధీ
-
1983 లో భారత పౌరసత్వం స్వీకరణ
-
1999లో 13వ లోకసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
-
అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఘనతను సొంతం చేసుకున్నారు.
-
2004లో అత్యంత శక్తివంతమైన మూడవ మహిళగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటన
-
2007, 2008లో టైమ్ రూపొందించిన అత్యంత ప్రభావవంతమైన వందమంది మహిళల జాబితాలో చోటు.
-
2006లో బ్రస్సెల్ యూనివర్సిటీచే గౌరవ డాక్టరేట్
-
2006లో బెల్జియం ప్రభుత్వంచే ఆర్డర్ ఆఫ్ కింగ్ లీపోల్డ్
-
2008లో యూనివర్సిటీ మద్రాస్ చే సాహిత్యంలో గౌరవ డాక్టరేట్