సాగుకు స్కానింగ్‌! | It is designed for a large digital research project | Sakshi
Sakshi News home page

సాగుకు స్కానింగ్‌!

Published Thu, Jul 13 2017 1:55 AM | Last Updated on Fri, Sep 28 2018 4:10 PM

సాగుకు స్కానింగ్‌! - Sakshi

సాగుకు స్కానింగ్‌!

భారీ డిజిటల్‌ పరిశోధనా ప్రాజెక్టుకు ఇక్రిశాట్‌ రూపకల్పన
వ్యవసాయశాఖకు ప్రతిపాదన... రిమోట్‌ సెన్సింగ్‌తో డేటా సేకరణ
ప్రతిపాదన ఆమోదం పొందితే వచ్చే నెల నుంచి ప్రాజెక్టు ప్రారంభం
తెలంగాణలో పంటల వర్గీకరణ, కనీసం మీటరు పరిధి నేలపైనా విశ్లేషణ    


సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయరంగ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయ భూమి, పంటలు, నేలలు తదితర అంశాలపై కచ్చితమైన శాస్త్రీయ సమాచారం అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ రంగం లోపభూయిష్టంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సాగు విస్తీర్ణం, ఏ నేలల్లో ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారనే అంశాలపై ఎప్పుడో నిర్ధారించిన సమాచారం అరకొరగా ఉంది. దీనివల్ల వ్యవసాయరంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు లోపాలతో కూడుకొని ఉంటున్నాయి.

 ఈ నేపథ్యంలో మొత్తం వ్యవసాయరంగాన్ని పునర్‌వ్యవస్థీకరించి గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై డాక్యుమెంటు తయారు చేసి ఇస్తామని ఇక్రిశాట్‌ ముందుకు వచ్చింది. డిజిటల్‌ వ్యవసాయ పరిశోధన ప్రాజెక్టు రూపకల్పనకు రూ.169.60 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖకు ప్రాజెక్టు ప్రతిపాదన నివేదికను బుధవారం అందజేసింది. ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే వచ్చే నెల నుంచే ప్రాజెక్టు ప్రారంభిస్తామని ఇక్రిశాట్‌ తెలిపిందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

డిజిటల్‌ ప్రాజెక్టుతో ప్రయోజనాలివి
ఈ ప్రాజెక్టు పూర్తి చేశాక కచ్చితమైన మ్యాపింగ్‌ చేసి అందజేస్తారు. గతంలో ఆస్ట్రేలియాలో ఇలాగే ప్రాజెక్టు నిర్వహించి ఒక మీటరు, 4 మీటర్లు, 24 మీటర్లు ఇలా భూమి పరిధిని పరిగణనలోకి తీసుకొని సూక్ష్మ విశ్లేషణ చేశారు. దీనివల్ల శాస్త్రీయ డేటా సేకరిస్తారు. అంటే ఒక మీటరు వ్యవసాయ విస్తీర్ణాన్ని కూడా విశ్లేషిస్తారన్నమాట

దీనివల్ల పంట దిగుబడి, ఉత్పాదకతను అంచనా వేయవచ్చు
కరువు, తుఫాన్లు, చీడపీడల వల్ల పంట నష్టం వాటిల్లితే సరైన అంచనా వేయవచ్చు
పంట పండించాక జరిగే నష్టాన్ని రైతువారీగా వ్యక్తిగతంగా అంచనా వేయవచ్చు
∙భూముల వర్గీకరణ శాస్త్రీయంగా అంచనా వేయడానికి వీలు కలుగుతుంది
∙పంటల సాగు కాలాన్ని, పంట పండే కాలాన్ని శాస్త్రీయంగా అంచనా వేయవచ్చు
భూగర్భ, ఉపరితల జలవనరులను అంచనా వేయవచ్చు. దానివల్ల వ్యవసాయానికి అవసరమైన ప్రణాళిక రచించవచ్చు

‘స్మార్ట్‌ ఫామింగ్‌’కు ఏర్పాట్లు చేసుకోవచ్చు. దానివల్ల ఇన్‌ఫుట్స్, సబ్సిడీలు, కూలీలు, వ్యవసాయానికి అందజేయాల్సిన ఆర్థిక సాయాన్ని సక్రమంగా అంచనా వేయడానికి వీలుకలుగుతుంది

మూడేళ్లపాటు నిర్వహణ
అగ్రి మానిటర్డ్‌ రీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌(అమార్ట్‌) పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2020 జూలై నాటికి పూర్తి చేయాలని ఇక్రిశాట్‌ సంకల్పించింది. దీనికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయశాఖ సహా పలు రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకోనుంది. రాష్ట్రంలో 85 శాతం మంది సన్న,చిన్న రైతులే ఉండటంతో వారికి తగినట్లుగా పంటల విధానం ఉండలన్నది ఇక్రిశాట్‌ ఆలోచన. అందుకోసం రిమోట్‌ సెన్సింగ్‌ డేటాను సేకరించడం అత్యంత కీలకమైన అంశమని ఇక్రిశాట్‌ స్పష్టం చేసింది. మల్టీస్పెక్ట్రల్‌ డేటా సేకరిస్తామని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement