ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు ఈనెల 30న నోటిఫికేషన్ జారీ చేయాలని ఎంసెట్ కన్వీనర్‌కు సూచించినట్లు చెప్పారు. సోమవారం ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పాలీసెట్ ప్రవేశాల కమిటీలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు ప్రభుత్వాల నుంచి స్పష్టత వస్తుందని ఇన్నా ళ్లూ వేచి చూశామని, అయినా రాకపోవడంతో ఉన్నత విద్యా మండలి తన బాధ్యతగా ఈ భేటీలను నిర్వహించిందన్నారు. ఎంసెట్ ప్రవేశాలకు ఆప్షన్ల ప్రక్రియను మాత్రం ప్రస్తుతానికి ప్రారంభించడం లేదన్నారు. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నందున, వారి ప్రయోజనాల దృష్ట్యా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి 15 నుంచి 18 రోజులు పడుతుందని చెప్పారు.
ఆలోగా అవసరమైన అన్ని ఉత్తర్వులు జారీ చేసేలా రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తామని, ఈ మేరకు లేఖలు కూడా రాస్తామని ఆయన తెలియజేశారు. దీనిపై తల్లిదండ్రులు ప్రశ్నించే అవకాశం ఉన్నందున ఇరు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యలు చేపడతున్నట్లు చెప్పారు. రెండు ప్రభుత్వాల అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఇది కోర్టు ధిక్కరణ కాదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మాత్రమే చేపడతామని, 4న సుప్రీం తీర్పును బట్టి మళ్లీ 5వ తేదీన సమావేశమై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయంలో కౌన్సిల్‌పై ఎవరి ఒత్తిడి లేదన్నారు. ఒకవేళ ఎంసెట్ మరీ ఆలస్యమైతే ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఎన్‌ఆర్‌ఐ కోటా ఉత్తర్వులు వచ్చాకే మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి వేరుగా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కాగా ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో పాటు ఏపీ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్ జైన్, ప్రవేశాల క్యాంప్ అధికారి రఘునాథ్‌తో పాటు 9 మంది యూనివర్సిటీ ల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే కమీటీలో సభ్యులైన తెలంగాణ అధికారులు వికాస్‌రాజ్, శైలజా రామయ్యార్, మరో యూనివర్సిటీ ప్రతినిధి మాత్రం హాజరుకాలేదు.