తొలి త్రైమాసికంలో శంకుస్థాపనలు
కొత్త ఐటీ, పరిశ్రమల ప్రాజెక్టులపై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇమేజ్ టవర్, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం తలపెట్టిన ఎస్‌ఎంఈ టవర్, టీ–హబ్ రెండో దశ ప్రాజెక్టుల భవన నిర్మాణ పనులకు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను పరిశ్ర మలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు మీ సేవా కేంద్రాల సేవలను మరింత విస్తరింపజేయాలన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల పనితీరుపై శుక్ర వారం సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలు, ఐటీ శాఖల్లో ఫైళ్లను 48 గంటల్లో పరిష్క రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఏడాదిలో నూతన ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఐటీ, పరిశ్రమల శాఖ లు పని చేయాలన్నారు.
టీఎస్–ఐపాస్ తర హా విప్లవాత్మక విధానం ద్వారా పరిశ్రమల శాఖ గతేడాది గణనీయ పురో గతి సాధించిందన్నారు. తెలంగాణ వస్తే పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వెళ్లిపోతాయన్న ప్రచారాన్ని తిప్పి కొట్టి దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలిపారని పరిశ్రమల శాఖ ఉద్యోగులను మంత్రి అభినందించారు. కొత్త పరిశ్రమలతో పాటు ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు సహకారం కోసం కొత్త కార్యక్రమాలను రూపొందిచాలని కోరారు. మహిళా, దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, మానవీయ కోణంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఢిల్లీ రెసిండెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ పాల్గొన్నారు.