అప్రెంటీస్‌లే ఆయువు! | ITI students itself suits for RTC Garage | Sakshi
Sakshi News home page

అప్రెంటీస్‌లే ఆయువు!

Published Fri, Jun 14 2019 2:52 AM | Last Updated on Fri, Jun 14 2019 2:52 AM

ITI students itself suits for RTC Garage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కండిషన్‌లో ఉంటేనే ఆర్టీసీ బస్సు రోడ్డుపై సరిగ్గా పరుగుపెడుతుంది, క్షేమంగా ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తుంది. కీలకమైన ఆర్టీసీ బస్సుల భద్రతా ప్రమాణాలు ఇప్పుడు ఐటీఐ విద్యార్థులపై ఆధారపడి ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఆర్టీసీలో పరిస్థితి ఇలాగే ఉంది. బస్సు ఎక్కి కూర్చుంటే మనకు అంతాడ్రైవర్‌ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ బస్సు డ్రైవర్‌ చేతికి వచ్చేముందు దాన్ని సిద్ధం చేసేది డిపో గ్యారేజీ కార్మికులే. బస్సు ఇంజన్‌ మొదలు, బ్రేకులు, బాడీ, సీట్లు.. ఇలా అన్నింటిని పరీక్షించేది ఈ కార్మికులే. వీరు పచ్చజెండా ఊపిన తర్వాతనే బస్సు డిపో నుంచి బయటకు వస్తుంది. వీరు లేకుంటే బస్సు డిపోకు పరిమితం కావాల్సిందే. కానీ చాలా డిపోల్లో ఈ కేటగిరీ కార్మికుల సంఖ్య తక్కువగా ఉంది. దాదాపు ఏడేళ్లుగా ఆర్టీసీలో నియామకాలు లేకపోవటంతో ఖాళీలు ఏర్పడి క్రమంగా వాటి సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆర్టీసీలో దాదాపు వేయికి పైగా ఇలాంటి కార్మికుల కొరత ఉంది. మరి వీరి సంఖ్య ఇంత తక్కువగా ఉంటే బస్సులు కండిషన్‌లో ఎలా ఉంటున్నాయన్న సందేహం వస్తుంది. కానీ బస్సులు కండీషన్‌ తప్పకుండా వాటిని కాపాడటంలో ఐటీఐ విద్యార్థులు కీలక భూమిక పోషిస్తున్నారు.

అప్రెంటిస్‌ షిప్‌తో ఆదుకుంటున్నారు
ఐటీఐలో చేరుతున్న విద్యార్థుల్లో డీజిల్‌ మెకానిక్‌ ట్రేడ్‌పై ఆసక్తి చూపే వారు ఎక్కువ. దీంతోపాటు మోటార్‌ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మన్, వెల్డర్‌ లాంటి ట్రేడ్స్‌లోనూ చాలామంది చేరతారు. ఇవన్నీ ఆర్టీసీ డిపో గ్యారేజీల్లో అవసరమైనవే. ఆ కోర్సుల్లో భాగంగా చివరలో రెండేళ్లపాటు విద్యార్థులు ఏదైనా నిర్ధారిత సంస్థలో అప్రెంటిస్‌ షిప్‌ చేయాల్సి ఉంటుంది. బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఎల్‌ లాంటి సంస్థలతో పాటు ఆర్టీసీ కూడా ఆ జాబితాలో ఉంది. కోర్సులో భాగంగా అప్రెంటిస్‌షిప్‌ ఎక్కడ చేయాలను కుంటు న్నారో విద్యార్థులు ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో భాగంగా ఇంజన్‌ మెకానిక్‌కు సంబంధించి చాలామంది ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ చేస్తే భవిష్యత్తులో అందులో ఉద్యోగావకాశం ఉంటుందన్న ఆశనే దానికి కారణం. ప్రస్తుతం అలా ఆర్టీసీలో మూడున్నరవేల మంది ఐటీఐ విద్యార్థులు అప్రెంటిస్‌షిప్‌ చేస్తున్నారు. వీరికి విడతలవారీగా పరీక్షలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వ అదీనంలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ సర్టిఫికెట్లు అందజేస్తుంది. ఆ తర్వాత వారు ఉద్యోగాన్వేషణ ప్రారంభిస్తారు. ఇలా అప్రెంటిస్‌షిప్‌ కోసం రెండేళ్ల కాలపరిమితితో ఆర్టీసీలో పనిచేసేవారు బస్సులు కండిషన్‌లో ఉంచటంలో కీలకంగా మారారు. కొన్ని డిపోల్లో బస్సులను సకాలంలో సిద్ధం చేయటం కుదరనంత ఇబ్బంది ఉంది. ఈ సమస్యకు ఐటీఐ విద్యార్థులు చెక్‌ పెడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు వీరు ప్రధాన సహాయకులుగా మారి కొన్ని నెలల్లోనే మెకానిక్‌ల స్థాయిలో పనిచేస్తున్నారు. రెండేళ్లపాటు పనిచేయాల్సి ఉన్నందున ఈలోపు పూర్తి పని నేర్చుకుంటున్నారు. సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీని వీరు ఆదుకుంటున్నారు. వీరు లేకుంటే బస్సులు కదిలే పరిస్థితి లేదు. కేవలం ఏడు వేల స్టైఫండ్‌తో వారు పని చేస్తుండటం ఆర్టీసీకి కూడా భారంగా లేకపోవటంతో సిబ్బంది నియామకం లేకుండానే వీరి పుణ్యంతో ఆర్టీసీ నెట్టుకొస్తోంది. 

ఇంతా చేస్తే ఉద్యోగం రాదు..
ఆర్టీసీలో ఉద్యోగం దక్కుతుందన్న ఆశతో ఇక్కడ అప్రెంటిస్‌షిప్‌ చేసేందుకు వచ్చే ఐటీఐ విద్యార్థులకు చివరకు నిరాశే మిగులుతోంది. ఇక్కడ ఖాళీలున్నా.. సిబ్బంది నియా మకానికి ప్రభుత్వం ఆమోదం లేకపోవటంతో భర్తీ ప్రక్రియ ఉండటం లేదు. అప్రెంటిస్‌షిప్‌ పూర్తయ్యాక సర్టిఫికెట్‌ తీసుకుని వెళ్లిపోవటం తప్ప ప్రయోజనం ఉండటం లేదు. భవిష్యత్తులో భర్తీ ప్రక్రియ ఉంటే వీరికి 10% వెయిటేజీ ఉంటుంది. కానీ ఏడేళ్లుగా నియామకాలు లేనందున ఆ అవకాశం ఎప్పు డొస్తుందో తెలియక వారు నిరాశగా వెనుదిరుగుతు న్నారు. వీరికి ఉద్యోగం కావాలి.. ఆర్టీసీకి ఉద్యోగులు కావాలి... ఇలా 2 అవకాశాలు ఉన్నా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం వీరికి స్టైఫండ్‌గా చెల్లిస్తున్న 7 వేలను రెట్టింపు చేస్తే వారి జీతాలు చెల్లించొచ్చు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం సమ కూర్చగలిగితే సరి పోతుంది. ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారు లు కోరుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అవకాశం కల్పించ టం లేదు. వీరి బదులు దాదాపు అంతే మొత్తం చెల్లించి ఔట్‌ సోర్సింగ్‌ కింద సిబ్బందిని అడపాదడపా తీసుకుంటున్నా రు. కానీ సంబంధిత కాంట్రాక్టర్‌ సిబ్బందికి కేవలం 9 వేలే చెల్లిస్తున్నాడు. ఆ డబ్బులు సరిపోక ఆ సిబ్బంది సరిగా పని చేయటం లేదు. దీని వల్ల కాంట్రాక్టర్‌ లబ్ది పొందటం తప్ప ఇటు ఆర్టీసీ, అటు ఉద్యోగులకు ఉపయోగం ఉండటం లేదు. ప్రస్తుతం 3 రోజులుగా దాదాపు వెయ్యి మంది ఐటీఐ విద్యార్థులు అప్రెంటిస్‌షిప్‌ పూర్తిచేసుకుని పరీక్షలు రాస్తున్నారు. వీరిలో చాలా మంది తమకు ఉద్యోగావకాశం కల్పించాలని కనిపించిన అధికారినల్లా కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement