తిరువనంతపురం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక పోషిస్తాయని, ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీలకు అనేక అవకాశాలు దక్కాయని, కానీ ఆయా పార్టీలు తాము ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. ఇక వారికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. శనివారం ప్రెస్‌క్లబ్ ఆఫ్ తిరువనంతపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘దేశంలో ని పలు ప్రాంతీయ పార్టీలతో టీఆర్‌ఎస్ చర్చలు జరిపింది. కాంగ్రెస్, బీజేపీలతో కలవకూడదన్నదే ప్రాంతీయ పార్టీల కూటమి ప్రాథమిక ఎజెండా. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. ఒకపక్క కీలకపాత్ర పోషిస్తూనే.. మరోపక్క కాంగ్రెస్, బీజేపీలను అధికారానికి దూరంగా ఉంచడం కోసం ఈ ప్రాంతీయ పార్టీలు కృషిచేస్తాయి. కాంగ్రెస్, బీజేపీలను సాగనంపాల్సిన సమయం వచ్చింది. దేశంలో నాన్–కాంగ్రెస్, నాన్–బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. దీనికోసం మేం తీవ్రంగా కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు.
అంతర్గతంగా పనిచేస్తున్నాం..
ఫెడరల్ ఫ్రంట్‌లో ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఫ్రంట్ ఎలాంటి పాత్ర పోషించబోతుందో చూస్తారని అన్నారు. ఫ్రంట్‌లో భాగంగా ఒకే భావస్వారూప్యత గల పార్టీలతో అంతర్గతంగా పనిచేస్తున్నామని తెలిపారు. దేశ పురోగతి కోసమే ఈ ఫ్రంట్ పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు తప్పక నెరవేర్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment