
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు విశిష్ట అతిథిగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీ, ఫలక్‌నుమా రెండు చోట్ల మాత్రమే పర్యటించే అవకాశం ఉందని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా అధికారుల నుంచి వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఆమె షెడ్యూల్‌లో మరో ప్రాంతం లేదన్నారు. ప్రధాని మోదీ, ఇవాంకా రాక, జీఈఎస్ సదస్సు, అధికారిక విందుల నేపథ్యంలో అందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివీ..
ఆ ఇద్దరి పర్యటనలూ ఇలా..
ఇవాంకా మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెస్టిన్ హోటల్‌కు వెళ్లడంతో పాటు హెచ్‌ఐసీసీలో జరిగే జీఈఎస్‌లో పాల్గొంటారు. అనంతరం తాజ్ ఫలక్‌నుమాలో విందుకు హాజరవుతారు. ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మియాపూర్ వెళ్లి మెట్రో రైలును ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జీఈఎస్‌కు.. ఆపై ఫలక్‌నుమాకు వెళ్తారు. విందు ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి శంషాబాద్ నుంచి తిరిగి వెళ్తారు. ఇవాంకా మాత్రం బుధవారం సాయంత్రం వరకు నగరంలోనే ఉంటారు. ఈ కార్యక్రమాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసుల్ని కేటాయించారు.
ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్..
జీఈఎస్‌కు సంబంధించిన ప్రధాన కంట్రోల్ రూమ్‌ను హెచ్‌ఐసీసీలో సైబరాబాద్ పోలీసుల అధీనంలో ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలు, ఫలక్‌నుమాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఉండనున్నాయి. వీటన్నింటినీ అనుసంధానిస్తూ డీజీపీ కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుంది. మరోవైపు సామాన్యులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, ఓఆర్‌ఆర్‌లను ఎక్కువగా వినియోగించనున్నారు. ప్రధానికి సంబంధించి ఫలక్‌నుమా, శంషాబాద్ విమానాశ్రయం తప్ప మిగతా టూర్ అంతా హెలికాప్ట్టర్‌లో జరుగుతుంది. ఆయా చోట్లకు రోడ్డు మార్గంలో వెళ్లే ప్రముఖులూ ఉండటంతో ట్రాఫిక్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment