
అర్చక సమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
సాక్షి, హైదరాబాద్: అర్చకులు, దేవాదాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. దేవాలయాల అర్చక ఉద్యోగ సమాఖ్య జూన్ నాలుగు నుంచి నిర్వహించనున్న సమ్మెకు సంబంధించి గోడ పత్రికను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంబంధిత శాఖ మంత్రికి, అధికారులకు సమస్యలు విన్నవించినా ఫలితం లేకపోవడంతో సమ్మెకు వెళ్తున్నారన్నారు.
ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్న వీరి డిమాండ్ న్యాయమైనదని పేర్కొన్నారు. అర్చక ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ భానుమూర్తి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. కార్యక్రమంలో టీఎన్‌జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నర్సింగరావు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.