ఇక జిల్లా కోసం ఉద్యమాలు
ఇన్నాళ్లూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు చేశారు. ప్రజలను చైతన్యపరుస్తూ రాష్ట్ర సాధనోద్యమానికి ఉత్ప్రేరకంగా నిలిచారు. రకరకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పోరుబాటలో ఎన్నో త్యాగాలు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అయినా వారు విశ్రమించడం లేదు. ఉద్యమ పథాన్ని వీడడం లేదు. కామారెడ్డి జిల్లా సాధన కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా సాధనోద్యమం సాగబోతోంది. శనివారం జేఏసీ, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశమై ఉద్యమ కార్యాచరణ నిర్ణయించనున్నారు.
కామారెడ్డి : ప్రజల ఆకాంక్షలకు అనుగుణం గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. టీ ఆర్‌ఎస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జిల్లాల పునర్విభజన చేస్తామని, కొత్తగా 14 జిల్లాలు ఏర్పా టు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఏర్పా టు చేయాలన్న డిమాండ్ మళ్లీ ముం దుకొచ్చింది. కామారెడ్డిని జిల్లాగా చేయడానికి కావాల్సిన భౌగోళిక, రాజ కీయ పరిస్థితులు, ఇక్కడ ఉన్న వసతులపై ‘సాక్షి’ గతంలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే కేసీఆర్ చేసిన ప్రతిపాదనల్లో కామారెడ్డి జిల్లా లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు. మెదక్‌ను మూడు జిల్లాలుగా విభజించి, మెదక్ జిల్లాలోకి నిజామాబాద్‌లోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలను కలపాలని ప్రభుత్వం యోచిస్తోంద న్న అంశం ఇక్కడ కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో కామారెడ్డిని జి ల్లా చేయాలన్న డిమాండ్‌కు మరింత బలం చేకూరింది.
ఇక్కడి నాలుగు ని యోజక వర్గాలను మెదక్‌లో కలపడం సరికాదని, కామారెడ్డినే జిల్లా చే యాలని అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాను సాధిం చుకోవడం కోసం ఉద్యమానికి ప్రజాసంఘాలు సన్నద్ధమవుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని నిర్మించాలని ప్రజలు నిర్ణయించారు. ముందుగా ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, స్పందనను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేతలు తెలిపారు.
నేడు అఖిల పక్ష సమావేశం
కామారెడ్డిని జిల్లా చేయాలన్న అంశంపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించడం కోసం శనివారం అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు జేఏసీ డివిజన్ కన్వీనర్ జి.జగన్నాథం, ప్రతినిధులు క్యాతం సిద్ధరాములు, వీఎల్.నర్సింహారెడ్డి, కే.తిర్మల్‌రెడ్డి, వి.శంకర్, రమేశ్ గుప్తా, రమణారావులు తెలిపారు. ఈ విషయమై వారు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 4 గంటలకు కామారెడ్డి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశమవనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు సమావేశానికి స్వచ్ఛందంగా హాజరు కావాలని కోరారు.