కామారెడ్డి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతున్న తరుణంలో.. జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు తొలుత పోలీసు అధికారులనే టార్గెట్ చేయనున్నారని సమాచారం. ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలోనూ తమకు సహకరించలేదని ‘కొందరు’ అధికారులపై గుర్రుగా ఉన్నారు. దీంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే పోలీసు అధికారులను బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని తెచ్చుకోవడానికి అప్పుడే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొందరు పోలీసు అధికారులు అతిగా వ్యవహరించడంతో పాటు తమ మాట వినలేదని, తమకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని టీఆర్‌ఎస్ నాయకులు వారిపై గుర్రుగా ఉన్నారు. తమకు సహకరించని అధికారులను సాగనంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. కామారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలున్నాయి. ఇందులో నాలుగు సర్కిళ్లు, 12 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఈ రెండు నియోజక వర్గాల్లో ఇంతకుముందు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కూడా అదే పార్టీకి చెందిన, పాత వారే గెలుపొందారు. అయితే రాష్ట్రంలో మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు చెప్పిందే ఇక్కడ వేదంగా నడిచింది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం మొత్తంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేశారని విమర్శలు ఉన్నాయి.
పోస్టింగుల విషయంలో అధికార పార్టీ నేతల ఆశీస్సులు పొందిన వారే వచ్చారు. ఆరోపణలు ఎదుర్కొన్నవారు సైతం అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో ఎలాంటి ఇబ్బంది పడలేదు. అయితే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడం, జిల్లా అంతటా టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగించింది. పైగా తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చేపట్టనుండడంతో అందరి దృష్టి పోలీసు అధికారులపై పడింది. కామారెడ్డి నియోజక వర్గంలోని ఆయా సర్కిళ్లలో పనిచేస్తున్న సీఐలు, ఎస్సైల విషయంలో ఇప్పటికే టీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా చర్చించినట్టు తెలుస్తోంది. కొందరు అధికారులు తమకు సహకరించకపోగా, తమ మాటను కనీసం పట్టించుకోలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. దీంతో అలాంటి అధికారుల విషయంలో సీరియస్‌గా ఆలోచించిన నేతలు ప్రభుత్వం ఏర్పడగానే మొదట వారిపై బదిలీ వేటు వేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
అప్పుడే మొదలైన పైరవీలు
కామారెడ్డి ప్రాంతంలో పనిచేయడానికి గాను కొందరు అధికారులు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. జిల్లాలో బదిలీలు జరిగినపుడు తమకు అవకాశం ఇప్పించమని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికారం చేపట్టబోతున్న టీఆర్‌ఎస్ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు అధికారులు సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఐ పోస్టింగుల విషయంలో గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన వారు, కొత్తవారు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమకు అవకాశం ఇస్తే పనితీరు చూపెడతామంటూ రాయబారాలు నడుపుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం మారడంతో తమకు బదిలీలు తప్పవనే భావనతో ఉన్న కొందరు అధికారులు ప్రస్తుత అధికార పార్టీ నేతలను మచ్చిక చేసుకోవడమో, లేక బదిలీకి సిద్ధపడాలనే యోచనలో ఉన్నారు.
టార్గెట్ పోలీస్ !
Published Mon, May 26 2014 2:12 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement