
సాక్షి, హైదరాబాద్: గత 52 రోజులుగా కొనసాగిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం హర్షణీయమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కార్మికులు మంగళవారం నుంచి విధుల్లో చేరుతామని ప్రకటించినందున వారిని విధుల్లో చేర్చుకునే విషయంలో ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఎలాంటి ఆటంకాలు సృష్టించినా అది శాంతి భద్రతల అంశంగా మారే అవకాశం ఉందని, మానవతాదృక్పథంతో వారు విధుల్లో చేరేలా కేసీఆర్ అనుమతించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.