పాలమూరుకు జైపాల్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ‘సేఫ్’ సీటుపై కన్నేశారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల లోక్‌సభ స్థానంలో ఎదురుగాలి వీస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి రాజకీయాలు తన గెలుపుపై ప్రభావం చూపుతాయనే ఆం దోళనతోనే ఆయన సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అం దుకే ఇప్పటివరకు చేవెళ్ల సెగ్మెంట్ పరిధిలో పర్యటించలేదని, మహబూబ్‌నగర్‌లో జైపాల్ వర్గం కొంతకాలంగా క్రియాశీలకంగా మారిందని అంటున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడ్డ చేవెళ్ల లోక్‌సభ స్థానంకోసం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్లార్) పోటీ పడ్డారు.
దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జోక్యంచేసుకుని లక్ష్మారెడ్డికి మేడ్చల్ అసెంబ్లీ స్థానం కేటాయించి, కార్తీక్‌కు నచ్చజెప్పి జైపాల్‌కు లైన్ క్లియర్ చేశారు. ఆ ఎన్నికల్లో జైపాల్ విజయం సాధించినప్పటికీ జిల్లాలో నెలకొన్న గ్రూపు రాజకీయాలతో తల బొప్పి కట్టింది. రాష్ట్ర మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్ వైరి వర్గాలుగా వ్యవహరిస్తుండటంతో వారిని కలుపుకుపోవడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు చేవెళ్ల లోక్‌సభ సీటుపై ఆశలు పెట్టుకున్న కార్తీక్‌రెడ్డి ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ చేపట్టారు.
దీనికి జైపాల్‌ను ఆహ్వానించినప్పటికీ ఆయన రాలేదు. తన నియోజకవర్గంలో కార్తీక్ పాదయాత్ర నిర్వహించడాన్ని తప్పుబట్టిన కేంద్ర మంత్రి... ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు వెళ్లకుండా నిలువరించగలిగారు. దాంతో జైపాల్, సబిత ఫ్యామిలీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే చేవెళ్ల సీటును దక్కించుకోవాలని సబిత వ ర్గం నిర్ణయించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీకి దిగబోనని ఇచ్చిన హామీ మేరకు చేవెళ్లను ఈసారి తనకు వదిలేయాలన్నది కార్తీక్ వర్గం వాదన. అయితే తన అనుచరుడైన ఉద్దమర్రి నరసింహారెడ్డికి మేడ్చల్ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకుంటున్న జైపాల్‌రెడ్డి... సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి చేవెళ్ల లోక్‌సభ టికెట్ ఇప్పించే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తద్వారా అటు సబిత వర్గం మీద పైచేయి సాధించడంతో పాటు తన అనుయాయుడికి మేడ్చల్ టికెట్ ఇప్పించుకోవచ్చన్నది జైపాల్ ద్విముఖ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.