పాలమూరు అభ్యర్థిగా జైపాల్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్రమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరు ఖరారైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ విడుదల చేయబోయే నాలుగో జాబితాలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీగా కొనసాగుతున్న జైపాల్‌రెడ్డి మళ్లీ ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఆయన విజ్ఞప్తి మేరకు ఏఐసీసీ పాలమూరు టిక్కెట్‌ను ఖరారు చేసింది.
1969లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జైపాల్‌రెడ్డి నాటి నుంచి నేటి వరకు 11 ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవగా, ఏడుసార్లు ఎంపీగా పోటీచేసి ఐదుసార్లు గెలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల గ్రామంలో జన్మించిన జైపాల్‌రెడ్డి 16 ఏళ్ల తరువాత పాలమూరు బరిలో దిగబోతున్నారు. 1998లో చివరిసారిగా జనతాదళ్ పార్టీ తరపున మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసిగెలిచారు. ఆ తరువాత ఆయన 1999, 2004 ఎన్నికల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు మారారు.