హరిత హారంలో ‘యూకలిప్టస్’ | jama oil take up farming in nalgonda district | Sakshi
Sakshi News home page

హరిత హారంలో ‘యూకలిప్టస్’

Published Wed, Feb 25 2015 1:12 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM

jama oil take up farming in nalgonda district

 జిల్లాలో జామాయిల్ సాగు చేపట్టాలని నిర్ణయం
 వర్షాభావ పరిస్థితులను అధిగమించి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం
 ఖమ్మం జిల్లా సారపాక ఐటీసీ నుంచి 50లక్షల మొక్కలు సరఫరా చేసుకునే యోచన
 జిల్లాలో ఈ ఏడాది మొత్తం 4.83కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం
 ఈనెల 28 నాటికి నర్సరీల్లో సిద్ధంగా ఉంటాయంటున్న అధికారులు
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జామాఅయిల్ సాగు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. తక్కువ వర్షాలున్నా పెరిగే ఈ మొక్కల వల్ల రైతులకు కూడా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఏడాది 50లక్షల యూకలిప్టస్ (జామాయిల్) మొక్కలను జిల్లాలో సాగు చేయాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి  నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి హరిత హారంలో భాగంగా ఈ ఏడాది మొత్తం 4.83 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటికే 3.83 కోట్ల మొక్కలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించారు. మిగిలిన 50లక్షలకు గాను జామాయిల్ మొక్కలు తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇటీవల ప్రతిపాదనలు పంపారు. అయితే, ఈ జామాయిల్ మొక్కలను పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఉన్న పేపర్ మిల్లు (ఐటీసీ) ద్వారా సరఫరా చేసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వం అనుమతి లభించగానే ఈ మొక్కలను జిల్లాకు తెప్పించి హరితహారం కింద రైతులకు సరఫరా చేయనున్నారు.
 
 జామాయిల్ ఎందుకు?
 వాస్తవానికి జిల్లాలో జామాయిల్ పంట సాగు చాలా తక్కువగా ఉంది. జిల్లాలోని నార్కట్‌పల్లి, శాలిగౌరారం ప్రాంతాల్లో కొంత ఈ పంటను సాగు చేశారు. అంతకుమించి మిగిలిన ప్రాంతాల్లో ఈ పంట సాగుకు రైతులు ఆసక్తి చూపలేదు. అయితే, సగటు వర్షపాతం తక్కువగా ఉండే మన జిల్లాలో ఈ పంట సాగుకు అనుకూలమని అధికారులంటున్నారు. ఒక్కసారి ఇది భూమిలో నాటుకుంటే పెద్దగా వర్షాలు అవసరం లేదని, 12 ఏళ్ల పాటు ఈ పంట సాగవుతుందని చెబుతున్నారు. రైతుకు కూడా నాలుగేళ్లకోసారి చొప్పున మూడుసార్లు పంట చేతికి వస్తుందని, ఏటా సగటున రూ.40వేల వరకు ఆదాయం లభిస్తుందని చెపుతున్నారు.
 
 మూడు మండలాలు మినహా
 వాస్తవానికి హరితహారం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా 56 మండలాల్లో చేపట్టారు. మునుగోడు, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో ఉన్న ఫ్లోరైడ్ తీవ్రత దృష్ట్యా  ఆ రెండు మండలాల్లో అమలు చేయడం లేదు. హుజూర్‌నగర్ మండలంలోని రైతులు ముందుకురానందున అక్కడ కూడా హరితహారం చేపట్టలేదు. ఇక, మిగిలిన 56 మండలాల్లో ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి 4.83 కోట్ల మొక్కలు నాటాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో 2.88 కోట్ల మొక్కలు అటవీశాఖ ద్వారా అందిస్తున్నారు. నిమ్మ, టెకోమా, బాహుమియా, తెల్లమద్ది, నేరేడు తదితర జాతులకు చెందిన 2కోట్ల మొక్కలకు తోడు 88లక్షల టేకు మొక్కలను అటవీశాఖ ద్వారా నాటనున్నారు. ఇందుకు సంబంధించిన విత్తనాలను తెప్పించి నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. మరో 27లక్షల టేకు మొక్కలను సూక్ష్మ సేద్య పథకం (టీఎస్‌ఎంఐపీ) ద్వారా, 18లక్షల మొక్కలను ఉద్యానశాఖ ద్వారా సాగు చేపట్టనున్నారు. మిగిలిన 1.5కోట్ల మొక్కలను నాటే బాధ్యతలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)కు అప్పగించారు. ఇందులో కోటి టేకు మొక్కలను తమిళనాడు ద్వారా తెప్పిస్తున్నారు. మిగిలిన 50లక్షల మొక్కలు యూకలిప్టస్ సాగు చేయాలని నిర్ణయించారు.
 
 మూడేళ్లు... 17కోట్ల మొక్కలు
 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆలోచన మేరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 40లక్షల మొక్కలు నాటాలన్నది హరితహారం కార్యక్రమ ఉద్దేశం. ఇలా మూడేళ్ల పాటు ఈ పథకాన్ని కొనసాగిస్తే మన జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 17కోట్ల మొక్కలు సాగు కానున్నాయి. అంటే ప్రతి గ్రామానికి రమారమి 33వేల మొక్కలన్నమాట. ఈ మేరకు హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా గుర్తించిన చోట్ల 483 నర్సరీలను ఏర్పాటు చేసింది. ఈ నర్సరీల్లో ఎకరానికి లక్ష మొక్కల చొప్పున పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా హరితహారం కన్వీనర్, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.
 
 ఎకరం భూమి ఇచ్చిన రైతులకు లీజు ధరతో పాటు మొక్కల పెంపకానికి అవసరమైరన నీటి ట్యాంకులు, చుట్టూ దిమ్మె, జల్లెడలాంటివి కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ఆయన వివరించారు. ఈ నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు గాను ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున జాబ్‌కార్డు ఉన్న రైతులను వనసేవకులుగా ఎంపిక చేసినట్టు చెప్పారు. దీంతో పాటు ఈ మొక్కలను సాగుచేసేందుకు ముందుకు వచ్చే రైతులకు ఉచితంగా సరఫరా చేయడంతో పాటు నెలవారీగా నిర్వహణఖర్చులను కూడా అందజేయనున్నట్టు వెల్లడించారు. మొత్తంమీద జిల్లాలో లక్ష్యంగా పెట్టుకున్న 4.83 కోట్ల మొక్కలను ఈ నెల 28 నాటికి నర్సరీల్లో ఉంచుతామని, ఆ తర్వాత మొక్కల పెంపకం చేపట్టి రబీ సీజన్ ప్రారంభమయ్యే వరకు వాటిని సాగు చేసేందుకు వీలుగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement