
జనసంద్రమే
గోదావరి మహాపుష్కరాలకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండోరోజైన బుధవారం దాదాపు 10 ల క్షల మంది భక్తులు వచ్చారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : గోదావరి మహాపుష్కరాలకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండోరోజైన బుధవారం దాదాపు 10 ల క్షల మంది భక్తులు వచ్చారు. అధికారిక లెక్కల ప్రకారం... బుధవారం సాయంత్రం 6 గంటల వరకు అందిన వివరాల ప్రకారం 7.3 లక్షలకు పైగా భక్తులు పుష్కర స్నానమాచరించారు. రాత్రి వేళల్లోనూ భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి దాటే వరకు జిల్లావ్యాప్తంగా 10 ల క్షలకుపైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించే అవకాశాలున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం అభిప్రాయపడింది. జిల్లాలోని ప్రధాన పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కాళేశ్వరం ప్రాంతాలకు భక్తజనం పోటెత్తారు.
పార్కింగ్ స్థలాలు వేలాది వాహనాలు, బస్సులతో నిండిపోయాయి. కాళేశ్వరంలో 3 వేలకుపైగా ప్రైవేటు వాహనాలు... 200కు పైగా ఆర్టీసీ బస్సుల్లో భక్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. తొలిరోజు రెండు లక్షల మంది హాజరుకాగా... జాయింట్ కలెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం రెండోరోజు సాయంత్రం 6 గంటల సమయానికే భక్తుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. సాయంత్రం 6 తరువాత సైతం జనం వేలాదిగా వస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి దాటేవరకు కాళేశ్వరంలో భక్తుల సంఖ్య 3 ల క్షలు దాటే అవకాశాలున్నాయని జిల్లా అధికారులు తెలిపారు.
ధర్మపురిలోనూ దాదాపు ఇదే సీను. బుధవారం సాయంత్రం వరకు 2.75 ల క్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించినట్లు ధర్మపురి తహశీల్దార్ మహేశ్వర్ వెల్లడించారు. అర్ధరాత్రి దాటే సమయానికి ఆ సంఖ్య 3 లక్షలు దాటే అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలతోపాటు మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి పవిత్ర గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాళేశ్వరంలోనే ఉండి ఘాట్ల ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లాలోని ప్రధాన ఘాట్లయిన మంథని, కోటిలింగా ల, గోదావరిఖని, రాయపట్నం ప్రాంతాలకు భక్తులు వేలాదిగా తరలిచ్చారు.
పోలీసు లెక్కలు వేరే...
పుష్కరాలకు ఎంతమంది వచ్చారనే వివరాలను జిల్లా ఎస్పీ డి.జోయల్‌డేవిస్ బుధవారం రాత్రి మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలీసుల లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 36 పుష్కర ఘాట్లకు 5.15లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో కాళేశ్వరంలో 1.70 ల క్షలు, ధర్మపురిలో 2.50 లక్షలు, కోటిలింగాలలో 32 వేలు, మంథనిలో 15 వేలు, గోదావరిఖనిలో 18,500 మంది భక్తులు హాజరైనట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సాయంత్రం 6 గం టల ప్రాంతంలో వెల్లడించిన మీడియా ప్రకటనలో కాళేశ్వరానికి 2.5లక్షల మంది భక్తులు వచ్చినట్లు ఉండగా రాత్రి 9 గంటలకు ఎస్పీ విడుదల చేసిన మీ డియా ప్రకటనలో 1.70ల క్షల మంది వచ్చారని పేర్కొనడం గమనార్హం. దీనినిబట్టి అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం లేదని తెలుస్తోంది.