సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని మనదేశంలో అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ఇదే కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతావని కరోనాపై జరుపుతున్న సమరంలో అన్ని రాష్ట్రాలూ స్వచ్ఛందంగా పాల్గొన్నాయి.
రాష్ట్రంలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇందులో పాల్గొన్నారు. ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించే క్రమంలో చేపట్టిన జనతా కర్ఫ్యూకు సానుకూలంగా స్పందన రావడంతో ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్య నగరం బోసిపోయింది. నిత్యం జనాలతో ఉండే ప్రధాన కూడళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. రోడ్లు అన్నీ ఖాళీగా, నిర్మానుష్యంగా మారాయి. ప్రజల నిబద్ధతతకు ఇదే తార్కాణమంటూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆ దృశ్యాలను ట్విటర్‌లో షేర్ చేశారు.
ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూ రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. అత్యవసర సేవలు అందించే సిబ్బందితో పాటు వైద్యులకు సంఘీభావంగా ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాల్సిందిగా పీఎం, సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 వేల మంది పోలీసులు, 11 వేల మంది హోంగార్డులు జనతా కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణలో జనతా కర్ఫ్యూ లైవ్ అప్‌డేట్స్
► తెలంగాణలో 5 జిల్లాల్లో లాక్‌డౌన్‌కు కేంద్రం సూచన. మార్చి 31వరకూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో లాక్‌డౌన్ చేయడానికి కేంద్రం సిద్ధమైంది.
►బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఆదివారం జింఖానా గ్రౌండ్ లో రెగ్యులర్ గా పిల్లలు ఆటలాడేవాళ్లు.. అయితే కర్ఫ్యూ నేపథ్యంలో జేబీఎస్, ప్యాట్నీ, పరేడ్ గ్రౌండ్, పారడైస్, కార్ఖానా, బోయిన్పల్లి రోడ్లు, ట్యాంక్ బండ్ అంతా వెలవెలబోతోంది.
►తెలంగాణలో 6 గంటలకే జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం పూట ఎల్లప్పుడూ రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. అతి తక్కువ వాహనాలు మాత్రమే రోడ్లపై కనిపిస్తున్నాయి. ఇక బస్సులు, మెట్రో రైళ్లు ఇప్పటికే డిపోలకు పరిమితమయ్యాయి.
► జనతా కర్ఫ్యూ ప్రభావంతో ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడూ జనాలతో సందడిగా ఉండే ఈ ప్రాంతాలు కర్ఫ్యూ నేపథ్యంలో నిర్మానుష్యంగా మారాయి.
►తెలంగాణలో ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాలు, పండ్లు, కూరగాయాలు, పెట్రోల్ బంకులకు మినహాయింపునిచ్చారు. మీడియాకు ఈ మినహాయింపు వర్తించనుంది. అంబులెన్స్‌లు, ఫైర్ సర్వీస్, విద్యుత్, నీటి సరఫరా, సీవరేజీ సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. అత్యవసర సేవల కోసం ప్రతి ఆర్టీసీ డిపోలో 5 బస్సులు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మెట్రో స్టేషన్లలో 5 మెట్రో రైళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment