సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వానొస్తే రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. వాహనాలు ముందుకు వెళ్లలేక తీవ్ర ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. నగరంలో అలాంటి ముంపు ప్రాంతాలు 160 ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ గుర్తించింది. సదరు ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ఈనెల 2వ తేదీన జేఎన్‌టీయూ నిపుణులు తదితరులతో సమావేశం నిర్వహించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్.. క్షేత్రస్థాయిలో పరిశీలించి తగుచూపాల్సిందిగా నిపుణులను కోరారు. తొలుత మేజర్ వాటర్‌లాగింగ్ ప్రాంతాల్లో సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతోనూ పరిష్కారాలుండాలని సూచించారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ ప్రొఫెసర్లు డాక్టర్ గిరిధర్, లక్ష్మణరావు జీహెచ్‌ఎంసీ ఎస్‌ఈలు, ఈఈలు, ఏఈఈలతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు సూచనలతో నివేదికనందజేశారు. ఆయా ప్రాంతాల్లోని ముంపు స్థలాలను గుర్తించిన ప్రొఫెసర్లు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇంకుడుగుంతలు నిర్మించాలని, ఇంజెక్షన్ వెల్స్ తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతానికి నీటినిల్వ ప్రాంతాల్లో ఉపశమన చర్యలకు సూచనలివ్వగా, శాశ్వత పరిష్కారానికి సహజ డ్రైనేజీలో డీవియేషన్లు, సమగ్ర హైడ్రాలాజికల్ స్టడీ, లాండ్‌యూజ్, లాండ్‌కవర్ చేంజ్ అనాలిసిస్ వంటివి అవసరమని స్పష్టం చేశారు. మూడు జోన్ల పరిధిలో మేజర్ నీటినిల్వ ప్రాంతాల్లో 19 ప్రాంతాలకు పరిష్కారాలు సూచించారు. మరికొన్ని ప్రాంతాల్లో నిల్వనీటిని బయటకు పంపించేందుకు తాత్కాలిక పరిష్కారాలు చూపారు. తాత్కాలిక పరిష్కార చర్యల్లో భాగంగా క్రాస్ ఫ్లో పైపులు , ప్రభుత్వ స్థలాల్లో వాటర్‌ట్యాంకుల నిర్మాణం, తాత్కాలిక హోస్‌పైప్‌ల ఏర్పాటు తదితరమైనవి ఉన్నాయి.
మేజర్ నీటి నిల్వల సమస్య
పరిష్కారానికి ప్రొఫెసర్లు సూచనలిచ్చిన ప్రాంతాల్లో కొన్ని..
♦ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ముంపు సమస్య పరిష్కారానికి రెండు ఇంజెక్షన్ బోర్లతోపాటు ఇంకుడుగుంత నిర్మాణం అవసరం. వీటితోపాటు గెస్ట్‌హౌస్ ప్రవేశ మార్గం ముందు నీరునిల్వలేకుండా తగిన చర్యలు చేపట్టాలి. గెస్ట్‌హౌస్ ఎడమ, లేదా కుడివైపున గెస్ట్‌హౌస్, రోడ్డుకు మధ్య ఇంకుడుగుంత, రెండు ఇంజెక్షన్ బోర్లు అవసరం. గెస్ట్‌హౌస్ ముందరి నాలాలోని పూడికను, వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి.
♦ రాజ్‌భవన్–సోమాజిగూడ మార్గంలోని విల్లామేరీ కాలేజీ దగ్గరి బస్టాప్ వద్ద ఇంజెక్షన్‌బోరుతోపాటు ఇంకుడుగుంత నిర్మించాలి. వరదనీరు ఇంకుడుగుంతలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి.
♦ బేగంబజార్ పోలీస్‌స్టేషన్ వద్ద కల్వర్టుపై ప్రస్తుతానికి రెండు అడుగుల ఎత్తుతో సైడ్‌వాల్ నిర్మించాలి. పరిస్థితులను బట్టి దీన్ని నాలుగు అడుగుల వరకు ఎత్తు పెంచాలి. నాలాలో చెత్త చెదారాలు వేయకుండా నాలా పై భాగంలో వైర్ ఫెన్సింగ్ వేయాలి. వర్షాకాలం ముగిసేంతవరకు నీటిలో తేలియాడే, ఘనవ్యర్థాలను ప్రతిరోజూ తొలగించాలి.
♦ అంబర్‌పేట చేనెంబర్ జంక్షన్ వద్ద కూడా ఇతరత్రా చర్యలతోపాటు రెండు ఇంజెక్షన్ బోర్‌వెల్స్, ఇంకుడుగుంత నిర్మాణం అవసరం. వరదప్రవాహం ఇంకుడుగుంతలోకి వెళ్లేలా ఉండాలి.
♦ మలక్‌పేట పీఎస్ వద్ద రెండు ఇంకుడుగుంతలతోపాటు ఒక ఇంజెక్షన్ వెల్, మరో బాక్స్‌డ్రెయిన్ కూడా నిర్మించాలి. మెట్రోస్టేషన్ వద్ద రూఫ్‌టాప్ నుంచి వచ్చే నీరు ఇంకుడుగుంతలోకి వెళ్లేలా చేయాలి.
♦ కార్వాన్ హెచ్‌ఎస్ రాయల్ రెసిడెన్సీ ఎదుట, బతుకుమ్మ కుంట దగ్గరి వైభవ్‌కాలనీ, స్పోర్ట్స్‌క్లబ్ క్రాస్‌రోడ్స్, చార్మినార్ జోన్‌లోని ఖాదీభండార్, అక్షయ్‌హోటల్, సిటీలైఫ్ ఫర్నిచర్, తదితర ప్రాంతాల్లోనూ ఇంకుడుగుంతలు, ఇంజెక్షన్‌వెల్‌లు, క్యారేజ్‌వే ఎత్తుపెంపు వంటివి చేపట్టాలని సూచించారు.
♦ దుర్గం చెరువు వద్ద వాన నీటి నిల్వకు పైప్‌లైన్, నీటి కుంటలు వంటివి అవసరమని సూచించారు.
♦ గ్రేటర్ పరిధిలో వరద, నీటిముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి జేఎన్‌టీయూ నిపుణులు దాదాపు రూ. 5 వేల కోట్లు ఖర్చయ్యే ప్రణాళికతో ప్రతిపాదనలు రూపొందించారు. వాటిని ఆమోదించిన స్టాండింగ్ కమిటీ.. ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో సత్వర ఉపశమన చర్యల కోసం జేఎన్‌టీయూ నిపుణులు ఈ సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment