శనివారం సచివాలయంలో మంత్రులు ఈటల, కేటీఆర్, జగదీశ్‌రెడ్డితో చర్చలు జరుపుతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ బదిలీలు ఇక ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోంది. ఈ వేసవి సెలవుల్లోనే అందుకు శ్రీకారం చుట్టే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటివరకు కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేస్తున్నారు. అయితే ఇందులో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఆన్‌లైన్ బదిలీల వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్, కె.తారకరామారావు, జి.జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రుల కమిటీ కూడా ఇదే విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు తెలిపింది. అందుకు ఉపాధ్యాయ సంఘాలు సైతం అంగీకరించాయి.
ఈ భేటీలో టీచర్లకు సంబంధించిన 36 రకాల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. గతంలో జరిగిన బదిలీల్లో అవకతవకల కారణంగా ముగ్గురు డీఈవోలు సస్పెండ్ అయ్యారని, దాంతో ప్రభుత్వం అభాసుపాలైందని మంత్రుల కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది. కోర్టులో ఉన్న సర్వీసు రూల్స్ అంశంపై వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని నియమించేందుకు కమిటీ స్పష్టమైన హామీ ఇచ్చిందని సంఘాలు తెలిపాయి. ఈలోగా సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారం కాకపోతే పాత రూల్స్ ప్రకారం ఎవరి మేనేజ్‌మెంట్‌లో వారికి పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు చేపడతామని వెల్లడించిందని వివరించాయి. వీటితోపాటు ఇతర సమస్యల పరిష్కారం పట్ల మంత్రుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసిందని సంఘాల నేతలు వెల్లడించారు. ఆర్థిక భారంతో కూడుకున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి
రోటీన్‌గా చేయాల్సిన అంశాల్లో పీఆర్‌సీ ఉందని, ఇందుకు సంబంధించి కమిషన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రుల కమిటీ తెలిపింఇ. ఒకవేళ నివేదిక, అమలు ఆలస్యమైతే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తామని పేర్కొన్నట్లు సంఘాల నేతలు చెప్పారు. అలాగే ప్రతి మండలంలో ఐదెకరాల స్థలం కలిగిన పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా అభివృద్ధి చేసి, క్లస్టర్ హాస్టళ్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు పేర్కొన్నారు. సర్వీసు రూల్స్, బదిలీలు, పీఆర్‌సీ ఏర్పాటు, ఇతర సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలన్నింటనీ క్రోడీకరించి సీఎంకు నివేదిక అందజేస్తామని పేర్కొంది. ఈ సమావేశంలో మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, జేసీటీయూ నాయకులు రఘనందన్, అంజిరెడ్డి, రఘుశంకర్‌రెడ్డి, మల్లయ్య, అంజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, సదానంద్ గౌడ్, చావ రవి, మైస శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే పరిష్కారిస్తాం: మంత్రి ఈటల రాజేందర్
ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను ఐదు రకాలుగా విభజించాం. అందులో ఒకటి రొటీన్‌గా చేయాల్సినవి. బదిలీలు, పదోన్నతులు, విద్యార్థులు ఉన్న చోటికి టీచర్లను పంపించడం. వీటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రెండోది న్యాయ వివాదాలతో ముడిపడిన అంశాలు. ముఖ్యంగా సర్వీసు రూల్స్ అంశం కోర్టులో ఉంది. ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే రాష్ట్రపతి ఆమోదం తీసుకువచ్చాం. సీఎం దృష్టికి తీసుకువెళ్లి కేసుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని నియమిస్తాం. మూడోది పాఠశాలల్లో సదుపాయాల కల్పన. ఇందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంకా> చేస్తాం. నాలుగోది ఆర్థిక భారంతో కూడిన అంశాలు. ఎన్టీఆర్ హయాంలో రూ.398 వేతనంతో నియమించిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చే అంశంపై సానుకూలంగా ఉన్నాం. పీఆర్‌సీ నియామకం చేయాల్సిందే. దానిపై సానుకూలంగా ఉన్నాం. ఐదో అంశం సీపీఎస్. దీనిపై ముఖ్యమంత్రికి అవగాహన ఉంది. గత ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకున్నాయి. ఇప్పుడు అలా లేదు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను పెంచాం. పండిట్, పీఈటీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదు. రాబోయే కాలంలో ఈ సంబంధం మరింత బలోపేతమై కొనసాగుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా వీలైనన్ని సమస్యలు పరిష్కరిస్తాం.
సానుకూలంగా స్పందించారు: సరోత్తంరెడ్డి, పీఆర్‌టీయూ–టీఎస్ అధ్యక్షుడు
సీపీఎస్ రద్దుపై సీఎంతో చర్చిద్దామని చెప్పారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం హైకోర్టులో ఉంది. సుప్రీం న్యాయవాదిని నియమించి జూన్ 6న వాదనలు వినిపించాలని కోరాం. అందుకు సానుకూలంగా స్పందించారు. బదిలీలు, పదోన్నతులు పాఠశాలలు ప్రారంభం కావడానికి ముందే చేపట్టాలని, అందుకు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే ఆయా అంశాలపై దృష్టి సారించాలన్నాం. 2003 డీఎస్సీ టీచర్ల సమస్యపై చర్చించాం. వేసవిలో మధ్యాహ్న భోజనం విధులు నిర్వర్తించిన టీచర్లకు 24 రోజుల ఈఎల్స్‌పై చర్చించాం. కమిటీ ప్రతి సమస్యను పరిష్కరించేలా సానుకూలంగా స్పందించింది. 34 డిమాండ్లలో ఒకటే పరిష్కారం అయింది. మిగతా వాటిని పరిష్కరించాలని విన్నవించాం. ఎయిడెడ్, కేజీబీవీ మోడల్ గిరిజన టీచర్ల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం.
పాత జిల్లాల ప్రకారం బదిలీలకు ఒకే: భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్షుడు
త్వరలో సీఎంతో సమావేశం నిర్వహించేందుకు ఓకే చెప్పారు. ఆర్థిక పరమైన సమస్యలపైనా సీఎంతో చర్చిద్దామన్నారు. కచ్చితంగా బదిలీలను పాత జిల్లాల ప్రకారమే చేస్తామని హామీ ఇచ్చారు. హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్క స్కూల్ ఉండేలా చూడమని కోరాం. ఎస్సీ, ఎస్టీ టీచర్లకు ఉన్నత చదువులకు వెళ్లే ఉత్తర్వులను అమలు చేస్తామన్నారు. మేనేజ్‌మెంట్ వారీగా పదోన్నతులను హెడ్ మాస్టర్లకే పరిమితం చేయకుండా కిందిస్థాయి టీచర్ల వరకు వర్తింపజేయాలని కోరాం.
పీఆర్‌సీ ఏర్పాటుకు ఓకే: నర్సిరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు
వీటిని ప్రాథమిక చర్చలుగా భావిస్తున్నాం. సానుకూల దృక్ఫథంతో ఉన్నాం. పాఠశాలల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రికి పూర్తి అధికారాలు ఇవ్వాలన్నాం. ఆర్థిక సమస్యల విషయంలో మాత్రమే సీఎం చొరవ తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలి. పీఆర్‌సీ, ఐఆర్ ఇస్తామన్నారు. స్వాగతిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment