
కొల్లాపూర్: పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆ శాఖ అధికారులకు సూచించారు. పోడు భూముల్లో పంటలు వేసుకున్న రైతుల జోలికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. శనివారం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో పర్యటించారు. ఈ నియోజకవర్గంలో అటవీ సరిహద్దుల పేరిట అధికారులు తవ్వుతున్న కందకాలను అడ్డుకుంటున్న రామాపురం, ముక్కిడిగుండం, నార్లాపూర్, కల్వకోల్, వరిదేల గ్రామాల రైతులతో మంత్రులు సమావేశమయ్యారు.
పోడు భూముల సాగుకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాకున్నా.. అడవులను నరుక్కుంటూ పోతే జీవరాశి ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. ఇప్పటివరకూ అటవీ భూములు సాగుచేసుకుంటున్న రైతుల జోలికి అధికారులు రారని, పంటలకు నష్టం చేయరని తెలిపారు. కందకాల తవ్వకాల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. అయితే, పంటలు సాగుచేయని భూముల్లో మాత్రం చెట్లు నాటుతామని స్పష్టం చేశారు.
1960లో చాలామంది రైతులకు అటవీ భూముల్లో రెవెన్యూ పట్టాలు ఇచ్చారని చెప్పిన ఆయన, రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులు గుర్తించేందుకు సర్వేఆఫ్ ఇండియాకు సీఎం కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. అక్కడి అధికారులు సర్వే చేశాక భూముల హద్దులు తేలుతాయన్నారు. ఆ విషయాలను తాము చూసుకుంటామని, అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు మంత్రి జోగు రామన్న సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment