‘వీక్‌’రైడ్స్‌..! | Joyrides in helicopter to be held on weekdays | Sakshi
Sakshi News home page

‘వీక్‌’రైడ్స్‌..!

Published Mon, May 1 2017 1:36 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

‘వీక్‌’రైడ్స్‌..! - Sakshi

‘వీక్‌’రైడ్స్‌..!

- జాయ్‌రైడ్స్‌కు శాపంగా పౌరవిమానయాన శాఖ నిబంధనలు
- నెలలో ఏడు రోజులకు మించి నడపొద్దన్న డీజీసీఏ
- పూర్తిస్థాయి హెలీప్యాడ్‌ లేకపోవటంతో కండిషన్‌
- సమాచారం లేక చేజారుతున్న పర్యాటకులు
- పూర్తిస్థాయి హెలీప్యాడ్‌ ఏర్పాటు దిశగా పర్యాటక శాఖ అడుగులు


సాక్షి, హైదరాబాద్‌: పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెలీ టూరిజం ప్రాజెక్టు జాయ్‌రైడ్స్‌కు పౌర విమానయాన శాఖ నిబంధనలు శాపంగా మారాయి. శాశ్వత ప్రాతిపదికన హెలీప్యాడ్‌ ఉంటే తప్ప సొంతంగా హెలీకాప్టర్‌ టూర్లకు వీల్లేదంటూ సివిల్‌ ఏవియేషన్‌ డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) స్పష్టం చేసింది. పూర్తిస్థాయి హెలీప్యాడ్‌ అందుబాటులో లేకుంటే నెలలో ఏడు రోజులకు మించి హెలీకాప్టర్‌ రైడ్స్‌కు వీలులేదని ఆదేశించింది. అసలే ఖరీదైన వ్యవహారం.. ఆపై పర్యాటకుల ఆదరణ అంతంత మాత్రంగా ఉండటంతో ఇప్పుడీ ప్రాజెక్టుకు ఈ నిబంధనలు పెద్ద అడ్డం కిగా మారాయి. ప్రత్యేక సందర్భాలు, సెలవు రోజుల్లో పర్యాటకుల డిమాండ్‌ కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాంటి రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడు జాయ్‌రైడ్స్‌ నిర్వహించటం కుదరని పరిస్థితి నెలకొంది.

పూర్తిస్థాయి హెలీప్యాడ్‌ లేదు..
పర్యాటక శాఖకు ప్రస్తుతం పూర్తిస్థాయి హెలీప్యాడ్‌ లేదు. గతంలో నెక్లెస్‌రోడ్డులో హెచ్‌ఎండీఏ స్థలంలో తాత్కాలిక హెలీప్యాడ్‌ ఏర్పాటు చేసి జాయ్‌రైడ్స్‌ ప్రారంభించింది. గతేడాది వీటిని ప్రారంభించే సమయానికి పర్యాటక శాఖకు ఈ నిబంధనపై అవగాహన లేదు. తీరా ట్రిప్స్‌ మొదలుపెట్టిన తర్వాత డీజీసీఏ అభ్యంతరం వ్యక్తం చేయటంతో రైడ్స్‌ రద్దు చేసుకోవా ల్సి వచ్చింది. వేసవి సెలవుల నేపథ్యంలో తాత్కాలిక హెలీప్యాడ్‌ నుంచే రైడ్స్‌ ప్రారంభించటంతో డీజీసీఏ మరోసారి నిబం ధనలను గుర్తు చేసింది. దీంతో గత్యంతరం లేక తొలి విడత ట్రిప్పులు నిలిపివేశారు.

ఒక్కో రైడ్‌కు రూ.3,500..
ఈ నెలాఖరున వారం రోజులపాటు జాయ్‌ రైడ్స్‌ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ ఉస్మానియా వందేళ్ల పండుగకు రాష్ట్రపతి రావటంతో భద్రతా కారణాలతో 2 రోజుల పాటు అనుమతి రద్దయింది. దీంతో 5 రోజు లకే పరిమితం చేసుకుని, వచ్చే నెల 9 నుంచి 14 వరకు మరో విడత నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కానీ ఈ మధ్య కాలంలో పర్యాటకులు ఆసక్తి చూపినా రైడ్స్‌ నిర్వహించలేని దుస్థితి నెలకొంది. 8 నిమిషాల నుంచి పది నిమిషాల మేర ఉండే ఒక్కో రైడ్‌కు రూ.3,500 వరకు టికెట్‌ ధర. దీంతో కొద్దిమంది మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. కానీ నెలలో ఏడు రోజులే ఉండటం, దానిపైనా సమాచారం లేకపోవటంతో పర్యాటకులు అయోమయానికి లోనవుతున్నారు. దీంతో టికెట్ల అమ్మకాలు నామమాత్రంగా ఉంటున్నాయి.

పూర్తిస్థాయి హెలీప్యాడ్‌ కోసం యత్నం..
హెచ్‌ఎండీఏతో కలసి పూర్తిస్థాయి హెలీప్యాడ్‌ ఏర్పా టు చేయాలని పర్యాటక శాఖ భావిస్తోంది. దానికయ్యే వ్యయాన్ని తనే భరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి త్వరలో పర్యాటక శాఖ అధికారులు హెచ్‌ఎండీఏను సంప్రదించనున్నారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో డిమాండ్‌ బాగా ఉంటుం దని అధికారులు భావించారు. ఇందుకోసం నగర గగనతలంలోనే కాక నాగార్జున సాగర్, వరంగల్‌ లాంటి ప్రాంతాలకు కూడా పర్యటనలుండేలా ప్రణాళిక రూపొందించుకున్నారు.

కానీ.. నగర గగనతలంపై విహరించేందుకే రూ.3,500 చెల్లించాల్సి రావటం, దూర ప్రాంతాలకు అది చాలా ఎక్కువగా ఉండటంతో ఎవరూ ఆసక్తి చూపటం లేదు. మరోవైపు చెరువు నీటినే రన్‌వేగా చేసుకుని గాలిలోకి ఎగిరే మినీ విమానాలను(సీప్లేన్‌) పర్యాటకుల ముంగిటకు తెచ్చే ఆలోచన కూడా తాత్కాలికంగా వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement