జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో స్టేషన్‌ షురూ.. | Jubilee Hills Check post Metro Station Open Today | Sakshi
Sakshi News home page

ఫిఫ్టీ..ఫిఫ్టీ

Published Sat, May 18 2019 11:05 AM | Last Updated on Sat, May 25 2019 12:24 PM

Jubilee Hills Check post Metro Station Open Today - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: నాగోల్‌–హైటెక్‌సిటీ కారిడార్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌మెట్రో స్టేషన్‌ శనివారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ స్టేషన్‌లో ఇవాళ్టి నుంచి మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ స్టేషన్‌ ఏర్పాటుతో ఫిల్మ్‌నగర్, జర్నలిస్ట్‌కాలనీ, నందగిరి హిల్స్, తారకరామ నగర్, దీన్‌దయాళ్‌నగర్, గాయత్రి హిల్స్, జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్‌ పార్క్, జైల్‌సింగ్‌నగర్, హైలంకాలనీ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రయాణికులకు మెట్రో జర్నీ సాకారం అయింది.. ఈ స్టేషన్‌ ప్రారంభంతో ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లో 27 స్టేషన్లు, నాగోల్‌–హైటెక్‌సిటీ రూట్లో 23 స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.

తల్లకిందులు..
గ్రేటర్‌వాసుల కలల మెట్రోలో ప్రయాణం చేసే వారి సంఖ్య విషయంలో అధికారుల అంచనాలు తల్లకిందులయ్యాయి. జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్య ముందుగా నిర్దేశించిన లక్ష్యానికి సగమే చేరువైంది. ఎల్బీనగర్‌–మియాపూర్‌(29 కి.మీ), నాగోల్‌–హైటెక్‌సిటీ(27 కి.మీ)రూట్లో ప్రయాణికుల సంఖ్య సుమారు ఐదు లక్షల మేర ఉంటుందని అంచనా వేసినప్పటికీ..నిత్యం 2.60 లక్షలు దాటడంలేదు. వారాంతాలు, సెలవురోజుల్లో ప్రయాణికుల సంఖ్య మరో 15–25 వేలచొప్పున పెరుగుతోంది. అయితే మెట్రో ప్రారంభానికి ముందు ఈ రెండు మార్గాల్లో నిత్యం సుమారుఐదు లక్షల మంది జర్నీ చేస్తారని అధికారులు అంచనా వేసిన విషయం విదితమే. కానీ వారానికి కేవలం 4 వేల మంది ప్రయాణికులే పెరుగుతుండడం గమనార్హం. ప్రధానంగా మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఫీడర్‌ బస్సు సర్వీసులు లేకపోవడం, అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్‌ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

కొన్ని స్టేషన్లు వెలవెల..  
సిటీలో పలు మెట్రో స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి లేక చిన్నబోతున్నాయి. స్టేషన్‌ నుంచి తమ ఇంటికి చేరుకునేందుకు ఫీడర్‌బస్సు సర్వీసులు లేకపోవడం, స్టేషన్లు అత్యంత సమీపంలో ఉండడం, పార్కింగ్‌ కష్టాలు వెరసి పలు స్టేషన్లకు గిరాకీ తగ్గడం గమనార్హం. ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–హైటెక్‌సిటీ మార్గాల్లోని ఇంటర్‌ఛేంజ్‌ మెట్రోస్టేషన్లను మినహాయిస్తే మొత్తంగా 50 స్టేషన్లున్నాయి. వీటిలో 14 స్టేషన్ల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య మూడు వేలలోపు మాత్రమే కావడం గమనార్హం. అయితే మిగతా స్టేషన్లలో మాత్రం రద్దీ పదివేలకు పైగానే ఉండడం విశేషం. మొత్తంగా రెండు కారిడార్ల పరిధిలోని మొత్తం 56 కిలోమీటర్ల రూట్లో మెట్రో అందుబాటులోకి వచ్చింది. ఇటీవల మెట్రో ప్రయాణికుల సంఖ్య 2.70 లక్షలకు చేరుకుంది. ప్రతీవారం మెట్రో ప్రయాణికుల సంఖ్యలో నాలుగువేల మేర పెరుగుదల నమోదవుతోందని..సిటీజన్లు మెట్రో జర్నీ పట్ల ఇప్పుడిప్పుడే ఆసక్తిచూపుతున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. అయితే మెట్రో అధికారుల అంచనా ప్రకారం ఈ రెండు రూట్లలో ఐదు లక్షలమంది ప్రయాణం చేస్తేనే నిర్మాణ సంస్థ లాభాల బాట పట్టే అవకాశం ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
 
ఈ స్టేషన్లు చిన్నబోతున్నాయ్‌..!
రెండు మార్గాల్లోని మొత్తం 50 స్టేషన్లకుగాను 14 స్టేషన్లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. ఆయాస్టేషన్లలో రాకపోకలు సాగించేవారు అత్యల్పంగా ఉంటున్నారు. మెట్రోరైలు రెండు కారిడార్లలో 56 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌(కారిడార్‌1) మార్గంలో 27 స్టేషన్లు ఉంటే నాగోల్‌–హైటెక్‌సిటీ(కారిడార్‌3)లో 24 స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం 50 స్టేషన్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అయితే వీటిలో ప్రయాణికులు లేక చిన్నబోతున్న స్టేషన్లు కారిడార్ల వారీగా ఇలా ఉన్నాయి.

ఎల్బీనగర్‌–మియాపూర్‌(కారిడార్‌1): ఈ మార్గంలో 7 స్టేషన్లకు ప్రయాణికుల ఆదరణ పెద్దగా లేదు. స్టేషన్లు మరీ దగ్గరగా ఉండటం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్టేషన్‌ వరకు చేరుకునే ఫీడర్‌ సర్వీసులు లేకపోవడం, ఆయా స్టేషన్ల వద్ద పార్కింగ్‌ వసతుల లేమి తో ఆదరణ పెద్దగా లేదు. బాలానగర్, మూసాపేట, భరత్‌నగర్, ఈఎస్‌ఐ, అసెంబ్లీ, మూసారాంబాగ్, న్యూమార్కెట్‌ (మలక్‌పేట గంజ్‌) స్టేషన్లలో ఎక్కేవారు 3 వేలలోపే ఉంటున్నారు. దిగేవారే సంఖ్య కూడా ఇంచుమించు ఇంతే మొత్తంలో ఉంది.

నాగోల్‌–హైటెక్‌సిటీ(కారిడార్‌3)లో:ఈమార్గంలో 7 స్టేషన్లలో ప్రయాణికుల ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. చుట్టుపక్కల కాలనీల నుంచి మెట్రో వరకు ఫీడర్‌ సర్వీసుల సదుపాయం లేకపోవడంతో చాలామంది సొంత వాహనాలపైనే వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ప్రధానంగా సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌జీఆర్‌ఐ, మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబరు 5, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ స్టేషన్లలో ఎక్కేవారు, దిగేవారు తక్కువగా ఉంటున్నారు. ఇక్కడ ప్రతిస్టేషన్లో ఎక్కేవారు 2000 నుంచి 3500లోపే ఉంటున్నారు. దిగేవారి సంఖ్య ఇంచుమించు ఇదేవిధంగా ఉంది.

ఐదు వేలపైన ప్రయాణికులుఈ స్టేషన్లలోనే..
ప్రయాణికుల సంఖ్య ఐదువేల నుంచి పదివేలలోపు ఉన్న స్టేషన్లు అత్యధికంగా ఉన్నాయి.
వీటిలో నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, పరేడ్‌గ్రౌండ్స్, బేగంపేట, దుర్గం చెరువు, కూకట్‌పల్లి, పంజగుట్ట, ఎర్రమంజిల్, లక్డీకాపూల్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి స్టేషన్లలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.

అనుసంధానంతో ఫలితాలు అంతంతే..
మెట్రోరైలు స్టేషన్లను నగరంలోని ప్రధాన బస్సుస్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్‌ స్టేషన్లతో అనుసంధానం చేశారు. ఆయా చోట్ల మెట్రోస్టేషన్లను సైతం నిర్మించారు. సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్‌ మినహా మిగతా వాటికి పెద్దగా ఆదరణ లేదు. ఎంజీబీఎస్‌లో హెచ్చుతగ్గులు బాగా ఉంటున్నాయి. మొత్తంగా చూస్తే 45 వేలలోపే ప్రయాణికులు ఉంటున్నారు. కొన్నిస్టేషన్లలో రెండు వేలకు మించడం లేదు. భరత్‌నగర్‌లో 2 వేల లోపే మెట్రో ఎక్కుతున్నారు. నాంపల్లి, మలక్‌పేట మెట్రో స్టేషన్లలో 3500కు మించడం లేదు. నాంపల్లి రైల్వేస్టేషన్‌కు ఉదయాన్నే వేర్వేరు ప్రాంతాల నుంచి రైళ్లు వస్తున్నాయి. ఇక్కడ దిగిన ప్రయాణికులు మెట్రోలో గమ్యస్థానం చేరుకుందామంటే ఉదయం 7 గంటలు దాటినా కొన్నిసార్లు మెట్రో స్టేషన్లు గేట్లు తీయడం లేదని పలువురు ప్రయాణికులు వాపోతుండడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement