
'రాజీతోనే ప్రశాంత జీవితం'
మెదక్ : రాజీతోనే ప్రశాంత జీవితం గడుపవచ్చునని మెదక్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ లలిత శివజ్యోతి పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని కోర్టు ఆవరణలో జాతీయ స్థాయి లోక్ అదాలత్ నిర్వహించారు. పలు కేసులను ఆమె రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి శివజ్యోతి మాట్లాడుతూ.. చిన్న చిన్న తగాదాలు, గొడవలతో కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి విలువైన సమయం, డబ్బును వృధా చేసుకోద్దన్నారు.
పెద్ద కేసులను రాజీచేయడం తగదని, చిన్నపాటి కేసుల్లో రాజీ మార్గమమే ఉత్తమమని ఆమె సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశం మాట్లాడుతూ... కక్షిదారులు చీటిమాటికి గొడవ పెట్టుకొని బంగారు భవిష్యత్ నాశనం చేసుకోకుండా రాజీపడటమే ఉత్తమమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజారత్నం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గోజి, లోక్ అదాలత్ సభ్యులు కరుణాకర్, శ్రీపతిరావు తదితరులు ఉన్నారు.