
ఎట్టకేలకు విధుల్లోకి జూడాలు
కోర్టు ఆదేశాలు, ప్రజా సంక్షేమం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు మెట్టుదిగి వచ్చారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా సమ్మెను విరమించి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు విధుల్లో చేరినట్లు ప్రకటించారు. అయితే, డిమాండ్ల సాధన కోసం ఇకపై కూడా పోరాడుతూనే ఉ ంటామని స్పష్టం చేశారు.
జూడాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో రోగులు, వారి బంధువులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. సమ్మెపై హైకోర్టు ఇచ్చిన గడువు ముగియటంతో జూనియర్ వైద్యులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని శనివారం మధ్యాహ్నం ఉస్మానియా వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జూడాల కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, కో కన్వీనర్‌లు నాగార్జున, చైతన్య, వంశీ వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చించి, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ నాగేశ్వర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జూడాలు స్వప్నిక, రిషిక, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
జూడాల సమ్మె విరమణను స్వాగతిస్తున్నాం: టి.రాజయ్య
జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరడాన్ని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్య స్వాగతించారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్లు బాధ్యతను తెలుసుకోవడం శుభపరిణామం అని అన్నారు. జూనియర్ డాక్టర్లు లేవనెత్తిన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు.