
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనున్న కొత్త పంచాయతీరాజ్ చట్టంతో దేశానికే ఆదర్శంగా తెలంగాణలో స్థానిక పాలన సాగాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్ట రూపకల్పనపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీతో శనివారం మంత్రి సమావేశమయ్యారు. చట్టంలో పొందుపర్చేందుకు సిద్ధం చేసిన పలు అంశాలపై చర్చించి సూచనలు చేశారు.
ప్రధానంగా గ్రామసభల నిర్వహణతో పాటు సర్పంచ్‌ల విధులు, బాధ్యతల అంశాలపై చట్టంలో చేయాల్సిన మార్పులపై దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా స్థానిక పాలనను కొత్త పుంతలు తొక్కించేలా చట్టానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల్లోని స్థానిక పాలనలో ఉన్న అన్ని అంశాలను పరిశీలించి మెరుగైన చట్టాన్ని రూపొందించాలన్నారు. గ్రామ సభలను నామమాత్రంగా కాకుండా పకడ్బందీగా నిర్వహించేలా చట్టంలో విధివిధానాలు రూపొందించాలని సూచించారు.
నిధుల కొరత లేదు..
నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ ఇచ్చి ప్లేస్‌మెంట్స్ కల్పించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా శిక్షణ కేంద్రాలను నిర్వహించాలని జూపల్లి కోరారు. టీ సిపార్డులో గ్రామీణ ప్రాంతాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు నిర్వహిస్తున్న సంస్థలతో శనివారం మంత్రి సమావేశమయ్యారు.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన కింద నిరుద్యోగ యువతకు శిక్షణ, ప్లేస్‌మెంట్స్ కల్పించడంలో భాగస్వామ్య సంస్థల కృషిని మంత్రి ప్రశంసించారు. గ్రామీణ యువతను శిక్షణ కేంద్రాలకు రప్పించడంతో పాటు స్వయం ఉపాధికి దోహదం చేసేలా శిక్షణ కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని, ఉపాధి శిక్షణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment