
2018 నాటికి ఓడీఎఫ్ రాష్ట్రంగా తెలంగాణ
భోపాల్‌లో పంచాయతీరాజ్ మంత్రుల భేటీలో మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 100శాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్) రాష్ట్రంగా చేసేందుకు ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 620 పంచాయతీలు, 3 నియోజకవర్గాలను ఓడీఎఫ్ ప్రాంతాలుగా ప్రకటించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
మంగళవారం భోపాల్‌లో జరిగిన అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల సదస్సుకు ఆయన హాజరయ్యా రు. ఈ భేటీలో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌లు పాల్గొన్నారు. సదస్సులో జూపల్లి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని.. సీఎం కేసీఆర్ నాయకత్వం లో అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. దాదాపు 40 లక్షల మందికి ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం అండగా ఉందన్నారు.
ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే...
పేదరికాన్ని రూపుమాపే లక్ష్యంతో 2014 ఆగస్టులో ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించామన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సమగ్ర సమాచా రాన్ని సేకరించగలిగామని జూపల్లి చెప్పారు. దీని ఆధారంగా పింఛన్ల పంపిణీలో మార్పులు చేశామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి లక్ష మందికి పైగా ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. 5,765 పంచాయతీలను కంప్యూటరీకరించామని.. త్వరలో అన్ని పంచాయతీల్లోనూ ఆన్‌లైన్ సేవలను అందిస్తామన్నారు. తెలంగాణలో అవినీతి రహిత పాలనకు కృషి చేస్తున్నామని.. దీనిలో భాగంగా స్థానిక ప్రతినిధుల వేతనాలను భారీగా పెంచామని తెలిపారు.