లింగంపల్లి గ్రామంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డికి జ్ఞాపికను అందజేస్తున్న గ్రామస్తులు
మంచాల (ఇబ్రహీంపట్నం): చాలారోజుల తర్వాత తన స్వగ్రామానికి రావటం సంతోషంగా ఉందని, ఇబ్రహీంపట్నం ప్రాంతాభివృద్ధికి తాను సహకారం అందిస్తానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి పేర్కొన్నారు. జస్టిస్ అభిషేక్‌రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా మంచాల మండ లం లింగంపల్లిలో ఆయనకు శనివారం గ్రామస్తులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కుటుంబం హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ వేసవి సెలవుల్లో తాను ఇక్కడికి వచ్చేవాడినని, అప్పుడు నీటివనరులు బాగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. నాడు ఇబ్రహీంపట్నం పచ్చని పొలాలతో కళకళలాడుతుండేదని, ఇప్పుడా పంటలు, నీటి జాడలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జస్టిస్ అభిషేక్‌రెడ్డిని గజమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. గ్రామస్తులతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీలక్ష్మీ, చీరాల రమేశ్, జంగారెడ్డి, అంజిరెడ్డి తదితరులు జస్టిస్ అభిషేక్‌రెడ్డిని కలసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినోద, ఉపసర్పంచ్ స్వాతి, నాయకులు అనిరెడ్డి శ్రీలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment