సాక్షి, హైదరాబాద్: ఓ భూమిపై యాజమాన్యపు హక్కులు ఎవరివో తేల్చాల్సింది న్యాయస్థానాలే తప్ప, తహసీల్దార్/ఎమ్మార్వోలు ఎంత మాత్రం కాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ఫలానా భూమి ప్రభుత్వ భూమి అని, దానిని ప్రైవేటు వ్యక్తులు రిజిస్టర్ చేయించుకున్నారని, అందువల్ల ఆ సేల్‌డీడ్‌ను రద్దు చేయాలని తహసీల్దార్/ఎమ్మార్వో కోరినప్పుడు దానిని రద్దు చేసే అధికారం రిజిస్ట్రేషన్ శాఖాధికారులకు ఉందంటూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో జస్టిస్ రామచంద్రరావు విభేదించారు. యాజమాన్యహక్కులు తేల్చడంతోపాటు సేల్‌డీడ్‌ల రద్దు కోరే అధికారం వారికి ఇస్తే పలు అనర్థాలు తలెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారం ఉందని ఎలా పడితే అలా చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కంది చిమ్నాపూర్‌లో స్థానిక తహసీల్దార్ అభ్యర్థన మేరకు ఆర్.సతీశ్‌యాదవ్‌కు చెందిన 28.6 ఎకరాల భూమికి సంబంధించిన రెండు సేల్‌డీడ్లను సబ్ రిజిస్ట్రార్ రద్దు చేశారు. దీనిని న్యాయమూర్తి రామచంద్రరావు తప్పుబట్టారు. సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఆ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కంది చిమ్నాపూర్‌లోని సర్వే నంబర్ 91/1, 91/1ఎలో రంగం ఎంటర్‌ప్రైజెస్, ఆర్.సతీశ్‌యాదవ్‌లకు 28.6 ఎకరాల భూమి ఉందని, అది ప్రభుత్వ భూమి అని, దానికి సంబంధించిన రెండు సేల్‌డీడ్లను రద్దు చేయాలని కంది సబ్ రిజిస్ట్రార్‌ను తహసీల్దార్ కోరారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఆ రెండు సేల్‌డీడ్లను రద్దు చేశారు. దీనిపై రంగం ఎంటర్‌ప్రైజెస్, సతీశ్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. పిటిషనర్లకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే సేల్‌డీడ్లను రద్దు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రీహర్షారెడ్డి తెలిపారు. తాము చట్టబద్ధంగానే భూములు కొనుగోలు చేశామని వివరించారు. తరువాత ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సేల్‌డీడ్లను రద్దు చేయాలని కోరే అధికారం తహసీల్దార్‌కు ఉందన్నారు. దీనిపై ఇటీవల సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని చెప్పారు.
ఆ తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలయ్యాయని, వాటిపై విచారణ సాగుతోందని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మరో జడ్జి ఇచ్చిన ఆ తీర్పుతో తాను ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. యాజమాన్యపు హక్కులను నిర్ణయించే అధికారం తహసీల్దార్‌కు ఇచ్చి, సేల్‌డీడ్‌లను కూడా రద్దు చేయిస్తుంటే అనర్ధాలే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆ అనర్ధాలను ఊహించడం కూడా కష్టమన్నారు. తహసీల్దారులందరూ ఒకే రకంగా ఉండరన్నారు. ధర్మాసనం ముందున్న అప్పీళ్లతో తనకు సంబంధం లేదంటూ కంది సబ్ రిజిస్ట్రార్ జారీ చేసిన సేల్‌డీడ్ల రద్దు ఉత్తర్వుల అమలును నిలిపేశారు.
ఆ తీర్పుతో నేను ఏకీభవించడం లేదు..
Published Thu, Nov 2 2017 3:47 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment