Justice Ramachandra Rao
-
హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు
-
హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ మామిడన్న సత్యరత్న రామచందర్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాజిందర్ కష్యప్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు.. 1966, ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మిం చారు. సెయింట్ పాల్స్ పాఠశాలలో పదవ తరగతి, లిటిల్ ఫ్లవర్స్ కళాశాలలో ఇంటర్, భవన్స్ న్యూసైన్స్ కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్), ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. ఎల్ఎల్బీలో ఎక్కువ మార్కులు సాధించినందుకు సీబీఎస్‌ఎస్ ఆచార్యులు స్మారక గోల్డ్ మెడల్ లభించింది. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. లండన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీలో 1991లో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఈ సమయంలో ఆయన కామన్వెల్త్ స్కాలర్షిప్, బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, కామర్స్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన సమయంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, డీసీసీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)తోపాటు పలు కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ తరఫున వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సేవలు అందించారు. సివిల్, ఆర్బిట్రేషన్, కంపెనీలా, అడ్మినిస్ట్రేటివ్, కాన్సిస్ట్యూషనల్ లా, లేబర్, సర్వీస్ లాకు సంబంధించిన కేసులను వాదించడంలో పేరుపొందారు. జస్టిస్ రామచందర్‌రావు.. 2012, జూన్ 29న ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013, డిసెంబర్ 4న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ రామచందర్‌రావు తండ్రి జస్టిస్ ఎం.జగన్నాథరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తి (1997–2000)గా పదవీ విరమణ చేశారు. అలాగే వీరి తాతయ్య జస్టిస్ రామచందర్‌రావు 1960–61లో హైకోర్టు జడ్జిగా సేవలు అందించారు. వీరి తాతయ్య సోదరుడు జస్టిస్ ఎం.క్రిష్ణారావు 1966–1973 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. చదవండి: సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు -
మెడికల్ ఫీజు కేసు మరో ధర్మాసనానికి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యంలో విచారణ నుంచి న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. ఈ వ్యాజ్యాన్ని మరో ధర్మాసనానికి నివేదించేందుకు వీలుగా ఈ కేసుకు సంబంధించిన అన్నీ ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం విచారించడంపై ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చైర్మన్, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి ఓ మెమో ద్వారా చేసిన ఆరోపణలను ధర్మాసనం తోసిపుచ్చింది. జస్టిస్ స్వరూప్‌రెడ్డి చేసిన ఆరోపణలు నేరపూరిత కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, అయినప్పటికీ తాము కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించడం లేదని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ స్వరూప్‌రెడ్డి తన ఆరోపణల ద్వారా న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లయిందని పేర్కొంది. కేసులో ఓడిపోయిన వ్యక్తులు ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ వెళుతుంటే, న్యాయమూర్తులు తమ విధులను నిర్వర్తించడం కష్టమవుతుందని తెలిపింది. హైకోర్టులో ఉన్న మూడు వేల మందికి పైగా న్యాయవాదులకు తమ నిష్పాక్షిత, స్వతంత్రత గురించి తెలుసునని వివరించింది. జస్టిస్ స్వరూప్‌రెడ్డి దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని పేర్కొంది. తమ ప్రవర్తన, విశ్వసనీయత గురించి తెలంగాణ ప్రజలు, న్యాయవాదులకు బాగా తెలుసునని వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ స్వరూప్‌రెడ్డి దాఖలు చేసిన మెమోపై ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత ఫీజుల పెంపు ఉత్తర్వులపై పిటిషన్ దాఖలు చేసిన 121 మంది వైద్య విద్యార్థుల తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి తమ వ్యాజ్యం గురించి సీజే జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వివరించారు. దీనిపై స్పందించిన సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. -
ఆ తీర్పుతో నేను ఏకీభవించడం లేదు..
సాక్షి, హైదరాబాద్: ఓ భూమిపై యాజమాన్యపు హక్కులు ఎవరివో తేల్చాల్సింది న్యాయస్థానాలే తప్ప, తహసీల్దార్/ఎమ్మార్వోలు ఎంత మాత్రం కాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ఫలానా భూమి ప్రభుత్వ భూమి అని, దానిని ప్రైవేటు వ్యక్తులు రిజిస్టర్ చేయించుకున్నారని, అందువల్ల ఆ సేల్‌డీడ్‌ను రద్దు చేయాలని తహసీల్దార్/ఎమ్మార్వో కోరినప్పుడు దానిని రద్దు చేసే అధికారం రిజిస్ట్రేషన్ శాఖాధికారులకు ఉందంటూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో జస్టిస్ రామచంద్రరావు విభేదించారు. యాజమాన్యహక్కులు తేల్చడంతోపాటు సేల్డీడ్ల రద్దు కోరే అధికారం వారికి ఇస్తే పలు అనర్థాలు తలెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం ఉందని ఎలా పడితే అలా చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కంది చిమ్నాపూర్‌లో స్థానిక తహసీల్దార్ అభ్యర్థన మేరకు ఆర్.సతీశ్యాదవ్కు చెందిన 28.6 ఎకరాల భూమికి సంబంధించిన రెండు సేల్డీడ్లను సబ్ రిజిస్ట్రార్ రద్దు చేశారు. దీనిని న్యాయమూర్తి రామచంద్రరావు తప్పుబట్టారు. సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఆ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కంది చిమ్నాపూర్‌లోని సర్వే నంబర్ 91/1, 91/1ఎలో రంగం ఎంటర్ప్రైజెస్, ఆర్.సతీశ్యాదవ్లకు 28.6 ఎకరాల భూమి ఉందని, అది ప్రభుత్వ భూమి అని, దానికి సంబంధించిన రెండు సేల్డీడ్లను రద్దు చేయాలని కంది సబ్ రిజిస్ట్రార్‌ను తహసీల్దార్ కోరారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఆ రెండు సేల్డీడ్లను రద్దు చేశారు. దీనిపై రంగం ఎంటర్ప్రైజెస్, సతీశ్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. పిటిషనర్లకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే సేల్డీడ్లను రద్దు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రీహర్షారెడ్డి తెలిపారు. తాము చట్టబద్ధంగానే భూములు కొనుగోలు చేశామని వివరించారు. తరువాత ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సేల్డీడ్లను రద్దు చేయాలని కోరే అధికారం తహసీల్దార్‌కు ఉందన్నారు. దీనిపై ఇటీవల సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని చెప్పారు. ఆ తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలయ్యాయని, వాటిపై విచారణ సాగుతోందని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మరో జడ్జి ఇచ్చిన ఆ తీర్పుతో తాను ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. యాజమాన్యపు హక్కులను నిర్ణయించే అధికారం తహసీల్దార్‌కు ఇచ్చి, సేల్డీడ్లను కూడా రద్దు చేయిస్తుంటే అనర్ధాలే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆ అనర్ధాలను ఊహించడం కూడా కష్టమన్నారు. తహసీల్దారులందరూ ఒకే రకంగా ఉండరన్నారు. ధర్మాసనం ముందున్న అప్పీళ్లతో తనకు సంబంధం లేదంటూ కంది సబ్ రిజిస్ట్రార్ జారీ చేసిన సేల్డీడ్ల రద్దు ఉత్తర్వుల అమలును నిలిపేశారు. -
ఇన్స్పెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ నిలిపివేత
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఇన్స్పెక్టర్ల పదోన్నతుల ప్రక్రియను ఉమ్మడి హైకోర్టు నిలిపేసింది. గత ఏడాది డిసెంబర్ 13న ప్రకటించిన సీనియారిటీ జాబితా ను 8 వారాల పాటు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సీనియారిటీ జాబితాను సవాలు చేస్తూ ఎస్పీ (నాన్ కేడర్) పి.వి.రాధాకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు ఆ సీనియారిటీ జాబితా అమలును నిలిపేశారు. ఆ జాబితా ఆధారంగా ఎటువంటి పదోన్నతులు చేపట్టవద్దని ప్రభుత్వా న్ని ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది.