ఏపీలో బాబు ఎందరు రేవంత్ లను పురమాయిస్తారో!
హైదరాబాద్ : ప్రజా ప్రతినిధుల సంఖ్యను బట్టి దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ స్థానాలను కేటాయిస్తే రాజకీయ బేరసారాలు ఆగిపోతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో టీడీపీకి బలం లేని జిల్లాల్లో కూడా పార్టీ అభ్యర్థులను ప్రకటించడం చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎందరు రేవంత్‌రెడ్డిలను ప్రజా ప్రతినిధుల కొనుగోలుకు పురమాయిస్తారోనని నెహ్రూ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ధర్మోపన్యాసాలు వల్లిస్తే చాలదని ఆచరించి చూపాలన్నారు. ఆయా పార్టీలకు శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఎమ్మెల్సీ పదవులను కేటాయించాలని చంద్రబాబు అన్నారని, ప్రస్తుతం స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరుగబోతున్న ఎన్నికల్లో ఆయా పార్టీలకు బలం ఉన్న చోటే పోటీ చేద్దామని నెహ్రూ ఆయనకు విజ్ఞప్తి చేశారు.
తమకు గాని, తమ పార్టీ అధ్యక్షుడికి గాని సంతలో పశువుల్లా ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని ప్రజాస్వామ్యంపై నమ్మం, గౌరవం ఉన్న పార్టీగా తాము అందుకు కట్టుబడి ఉంటామన్నారు. మంచి సంప్రదాయాన్ని నెలకొల్పేందుకు బాబు ముందుకు వచ్చి టీడీపీకి బలం ఉన్న జిల్లాల్లోనే కౌన్సిల్ అభ్యర్థులను పోటీ చేయిస్తే మంచిదని పేర్కొన్నారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, విశాఖ జిల్లాల్లో రెండు పదవులున్నా విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నెహ్రూ తప్పు పడుతూ దీనిపై తాము న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. ఒకే గ్రూప్‌గా నోటిఫికేషన్ వచ్చినట్లయితే టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు చెరొక స్థానం వచ్చే పరిస్థితి ఉండేదని ఇపుడలా కాకుండా చేశారని ఆయన దుయ్యబట్టారు.