
మాటలతో మోసం చేస్తున్న సీఎం
హన్మకొండ : సీఎం కేసీఆర్ తన మాటలతో ప్రజలను మోసగిస్తున్నాడని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె.ధనలక్ష్మి మండిపడ్డారు. వీఓఏల సమస్య లు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12న ఖమ్మంలో ప్రారంభించిన జీపుజాతా మంగళవారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐకేపీ ఉద్యోగులు హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్ నుంచి కాళోజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధనలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదున్నర నెలలు గడుస్తున్నా ఐకే పీ ఉద్యోగులకు వేతనాలు అందించేందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంద న్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సమ్మె చేసినప్పుడు తమకు మద్దతు పలికిన టీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు మంత్రులుగా వీఓ ల వేతనాల అంశాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వీఓఏలకు రావాల్సిన 17 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరా రు. అలాగే రూ.5 వేల వేతనం పెంచాలని, ఆహార భద్రత కార్డులివ్వాలని, సహజ మరణానికి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈనెల 22న తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడిని ఐకేపీ ఉద్యోగులు విజయవంతం చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య, తెలంగాణ ఐకే పీ వీఓఏల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేష్, జిల్లా అధ్యక్షురాలు మాధవి, లావణ్య, రమేష్, మంగ, సరస్వతి, సుధాకర్, చక్రపాణి, సాయిలు, యాదానాయక్, శంకర్, విద్యాసాగర్, వెంకటేష్ పాల్గొన్నారు.