ప్రజల కలలు కల్లలయ్యాయి
► టీఆర్‌ఎస్ హామీలతో ప్రజలు కలలు కన్నారు
► కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి
సాక్షి, నిజామాబాద్: ‘‘ఎన్నికల సమయం లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాటలతో ప్రజలు కలలు కన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో పడుకున్నట్లు.. మూడెకరాల భూమిలో దున్నుకున్నట్లు.. రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినట్లు.. కేసీఆర్ మాటలు నమ్మి ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఆ కలలు కల్లలై ఇప్పుడు అనుభవిస్తున్నారు’’ అని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు.నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్వంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 4 రోజులుగా చేస్తున్న పాదయాత్ర ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా బోధన్‌లో జరిగిన సభలో జానారెడ్డి ప్రసంగించారు. షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని శాసనసభ, మండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి పెం చుతామన్నారు.
2019లో తాము అధికారంలోకి వచ్చాక ఎన్‌డీఎస్‌ఎల్‌తోపాటు, సిర్పూర్ పేపర్ మిల్లు, వరంగల్ రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపించి రైతులు, కార్మికులను ఆదుకుంటామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్న కేసీఆర్ రైతుల రుణమాఫీకి రూ.6వేల కోట్లను ఏకకాలంలో బ్యాంకులకు విడుదల చేసి, 37 లక్షల మంది రైతుల పాస్‌బుక్కులు, బంగారు నగలను విడిపించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్‌డీఎస్‌ఎల్‌ను పున రుద్ధిస్తామన్న కేసీఆర్.. రెండేళ్లయినా చేయలేకపోవడానికి కారణం నిధుల కొరతా.. చెరుకు రైతులు, కార్మికులపై నిర్లక్ష్య వైఖరా చెప్పాలన్నారు.
పోచారం పనితీరు బాగాలేదని తన సర్వేల ద్వారా కేసీఆర్ తేల్చారని, దీంతో ఆయన పదవి ఊడటం ఖాయమైనందున పదవి నుంచి తప్పుకోవాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఎల్‌ను సగం అమ్మితే, టీఆర్‌ఎస్ సర్కారు దాన్ని పూర్తిగా అమ్మేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ.. టీడీపీ బీ టీం అన్నారు. టీఆర్‌ఎస్ తెలంగాణ రాబందుల పార్టీగా తయారైందని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శిం చారు. ఎన్‌డీఎస్‌ఎల్‌లో చెరుకు క్రషింగ్ ప్రారంభించకపోతే, టీఆర్‌ఎస్ ఎన్నికల హెలికాప్టర్ క్రాష్ అవడం ఖాయమని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సభలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, నేతలు సునీతాలక్ష్మారెడ్డి, ఈరవత్రి అనిల్, జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బీన్ తదిత రులు పాల్గొన్నారు.