మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం
రేపు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలని శనివారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల కు నిరసనగా సోమవారం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు భువనేశ్వర్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో తాను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై పార్టీ జాతీయ నాయకత్వం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిందన్నారు. దీనివల్ల ప్రజల్లో వైషమ్యాలు పెరుగుతాయన్నారు. కాగా, ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పోరాటాల ద్వారా ఎదుర్కొంటామని లక్ష్మణ్ భువనేశ్వర్ నుంచి ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు.
నేడు నిరసన పాదయాత్ర: శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది.