సాక్షి, హైదరాబాద్: మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో వంద శాతం ఫలితాలను సాధించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. విద్యార్థులందరూ 10/10 జీపీఏ సాధించేవిధంగా కృషి చేయాలని, దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. గురువారం జరిగిన గురుకులాలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్ల వార్షిక సమావేశంలో కడియం మాట్లాడారు. గురుకులాల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు నీట్, జేఈఈలో అధిక ర్యాంకులను సాధించేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గురుకులాలు, మోడల్ స్కూళ్లు హరిత వనాలుగా ఉండాలని, వచ్చే ఏడాది నుంచి బెస్ట్ హరిత స్కూల్ ప్రైజ్ ఇస్తామన్నారు. త్వరలోనే మోడల్ స్కూల్ టీచర్ల సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారం అవుతుందని, ఇప్పటికే వారిని సీపీఎస్ పరిధిలోకి తెచ్చామని కడియం తెలిపారు. రాష్ట్రంలోని 90 శాతం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు నాణ్యమైన విద్య అందించేందుకుని ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి కొత్తగా 544 గురుకులాలు ప్రారంభించారని చెప్పారు. ఈ ఏడాది ఆరు గురుకుల స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామని, వచ్చే ఏడాది మిగిలిన 29 గురుకులాలను కూడా జూనియర్ కాలేజీలుగా మారుస్తామని వెల్లడించారు.
వచ్చే ఏడాది నుంచి జిల్లాకు రెండు చొప్పున గురుకులాలు ఉంటాయని, కొత్తగా 35 సాధారణ గురుకులాలు వస్తాయన్నారు.ఎన్డీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఎత్తివేసిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 218 కోట్లు వెచ్చించి వాటిని కొనసాగిస్తోందన్నారు. ప్రధాన మంత్రి బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదం ఇచ్చారే కానీ విద్యా రంగంలో ఒక్క కొత్త పథకాన్ని కూడా వారి కోసం తీసుకురాలేదని అన్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, మోడల్ స్కూల్స్, గురుకులాల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment