కరీంనగర్ ఇక స్మార్ట్ సిటీ
రాష్ట్రానికి తెలిపిన కేంద్ర ప్రభుత్వం సీఎస్‌కు లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ నగరాల జాబితాలో కరీంనగర్‌కు చోటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తొలుత హైదరాబాద్, వరంగల్ నగరాలను స్మార్ట్ నగరాల మిషన్ ద్వారా అభివృద్ధికి ప్రతిపాదించింది. అయితే ఈ పథకం కింద వచ్చే నిధులు హైదరాబాద్ వంటి మహా నగరానికి సరిపోవని భావించి హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌ను ప్రతిపాదించింది. సాధ్యాసాధ్యాలను, సాంకేతిక అంశాలను పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్మార్ట్ నగరాల జాబితాలో కరీంనగర్‌కు స్థానం కల్పించింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలోని స్మార్ట్ సిటీస్ డివిజన్ డెరైక్టర్ మునీష్ కుమార్ గార్గ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శికి లేఖ రాశారు.
మొత్తం దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని తలపెట్టిన కేంద్రం రాష్ట్రాల ప్రతిపాదనలతో 98 నగరాలకు జాబి తాలో చోటు కల్పించింది. అయితే నిధుల కొరత కారణంగా తొలి ఏడాది 20 నగరాలకు, రెండో ఏడాది 40 నగరాలకు, మూడో ఏడాది 40 నగరాలకు నిధులు కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులోభాగంగా తొలి ఏడాది 20 నగరాలను ఎంపిక చేసింది.
అలాగే మలి విడతకు సంబంధించి 40 నగరాల ఎంపికలో భాగంగా ఫాస్ట్ ట్రాక్ పోటీలో మరో 13 నగరాలను ఎంపిక చేసింది. ఈ 13 నగరాల్లో వరంగల్‌కు స్థానం దక్కిన సంగతి తెలిసిందే. మిగిలిన 27 నగరాలను అక్టోబర్ కల్లా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇలా ఎంపికైన నగరాలకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం నుంచే నిధులు కేటాయించనుంది.
‘వెనుకబాటు’ నిధులు విడుదల చేయాలి
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండో విడతగా రూ. 450 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసాను కోరినట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలచారి గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. ఇదే సమావేశంలో ఎంపీ బి.వినోద్‌కుమార్ స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్‌కు స్థానం లభించేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మార్చేందుకుగానూ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు కేంద్రం రూ. 2 కోట్లు మంజూరు చేసిందని, ఈ దిశగా త్వరలో కరీంనగర్ నగర ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి నివేదికను సిద్ధం చేస్తామని తెలిపారు. కరీంనగర్ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించి గొప్ప ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులందరం కృషి చేస్తామని చెప్పారు.