
కేసీఆర్‌ను ఎక్కువసార్లు కలిసింది కోమటిరెడ్డే
హైదరాబాద్: కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో చీఫ్ సెక్రటరీని కలిసిన తరువాత ఏం మాట్లాడాలో తెలియక అనవసర ఆరోపణలు చేశారని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు తక్కువగా ఇస్తున్నారనే ఆరోపణలు అవాస్తమన్నారు. సీఎంను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదని చెప్పటం చాలా హాస్యస్పదమని తెలిపారు. కాంగ్రెస్ నేత్లో సీఎం ను ఎక్కువ సార్లు కలిసింది కోమటిరెడ్డెనని స్పష్టం చేశారు. దాదాపుగా ఆయన తరుపున ఇప్పటికే 391 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని కర్రె తెలిపారు.
పైరవీలకు కాంగ్రెస్ నేతలు అలవాటు పడ్డారని టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పైరపీలకు తావులేదన్నారు. కాంగ్రెస్ నేతలు తెలుగు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. వారికి ఢిల్లీ భాష మాత్రమే గుర్తుందన్నారు. అందుకే కేసీఆర్ భాషపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కోమటి రెడ్డి గతంలో ఐటీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు చేసిందేమీ లేదని విమర్శించారు. కేటీఆర్ అమెరికా టూర్‌పై విమర్శలు చేయటం తగదని అన్నారు. కేటీఆర్ 5 సార్లు అమెరికా వెళ్లటం తో అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు స్కాంలు మాత్రమే తెలుసునని.. స్కీమ్ ల గురించి తెలియదన్నారు. అందుకే గొర్రెల పంపణీలో కూడా స్కాం ఉందని ఆరోపిస్తున్నారని విమర్శించారు.