సాక్షిప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ అని, బీజేపీ అంటే ‘మందిర్’వివాదం గుర్తుకు వస్తుందని నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత విమర్శించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ, డిచ్‌పల్లి మండలాల్లో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్‌షోలు, బహిరంగ సభల్లో ప్రసంగించిన కవిత.. బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీల నుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్.. ప్రాంతీయ పార్టీ అని, 16 మంది ఎంపీలు గెలిస్తే ఢిల్లీలో ఏం చేస్తారని సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిపికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైనా బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని, ఆసరా లబ్ధిదారులకు ఇచ్చే పింఛన్ మొత్తంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.200 మాత్రమేనని, మిగిలిన రూ.800 రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. మే నెల నుంచి రూ.2 వేల పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. రెండేళ్లలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామని చెప్పారు. ప్రచార కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ సుమనారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకులు గడ్డం ఆనంద్‌రెడ్డి, బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment