రమేష్, దయాకర్‌రావు, ధర్మారెడ్డి ,వినయ్‌భాస్కర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘గులాబీ’ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ మెరుపు వ్యూహాలతో ప్రతిపక్షాల మీద దాడికి సిద్ధమవుతున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే గురువారం శాసన సభ రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్న సీఎం కేసీఆర్.. మరో అడుగు ముందుకేసి సెప్టెంబర్ మాసంలోనే పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం ముఖ్యమంత్రి స్వీయ సర్వేతోపాటు ఇంటెలిజెన్సీ నివేదికలను వడబోసి వివాద రహితులు, గెలుపు గుర్రాలుగా తేలిన అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
సర్వేలు, నివేదికల ఆధారంగా..
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు, ఔత్సాహిక నేతల వివరాలు తెప్పించుకున్న కేసీఆర్.. దఫాలవారీగా చేయించిన స్వీయ సర్వేలు, ఇంటెలిజెన్సీ నివేదికలకు ప్రాధాన్యం ఇచ్చి అభ్యర్ధుల జాబితాను మదింపు చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ చివరి వారం నాటికి మూడు జాబితాలతో మొత్తం అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో వివాదరహితులు, సమర్థులుగా గుర్తింపు పొందిన రేసు గుర్రాల పేర్లను ప్రకటించాలయి యోచిస్తున్నట్లు తెలిసింది. తొలి జాబితాలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు మొదటి జాబితాలోనే చోటు దక్కినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
వీళ్లకు ఒకటి, రెండు రోజుల్లో అధినాయకత్వమే స్వయంగా ఫోన్ చేసి ప్రజల్లోకి వెళ్లి పని చూసుకొమ్మని చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలు కూడా పెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి సంబంధించి టికెట్ల కేటాయింపుపై ఎలాంటి అనుమానాలు లేకున్నా.. వారికి తొలి జాబితాలో చోటు లభించకపోవచ్చని విశ్వసనీయ సమాచారం.
నేతలు పోయినా.. ప్రజలు వెళ్లకుండా..
అధికార, గోడ దూకిన ప్రతిపక్ష పార్టీ నాయకులతో టీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతానికి కలెగూర గంపలాగే ఉంది. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అనంతరం నియోజకవర్గాల పునర్విభజన అంశం తెర మీదకు వచ్చింది. టీఆర్‌ఎస్ పార్టీ అధినాయకత్వమే పక్కా పథకంతో విస్తృత ప్రచారాన్ని కొనసాగించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్‡్ష చేపట్టారు. దీంతో ప్రతిపక్ష పార్టీల నుంచి చిన్న, పెద్ద నాయకులుం ఇబ్బడిముబ్బడిగా వలస వచ్చి టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.
ఇప్పుడు వీళ్లందరూ టికెట్లను ఆశిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన కేసీఆర్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఒకవేళ టికెట్ రాని నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయినా.. ప్రజలు వారి వెంట వెళ్లకుండా కట్టడి చేసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఇందుకోసం రాజకీయ ప్రత్యర్థులు అందుకోలేనంత వేగంగా, కచ్చితమైన ఎన్నికల వ్యూహ రచన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment