పీవీకి భారతరత్న ఇవ్వాలి | KCR Asks Bharat Ratna For PV Narasimha Rao | Sakshi
Sakshi News home page

పీవీకి భారతరత్న ఇవ్వాలి

Published Wed, Jun 24 2020 5:16 AM | Last Updated on Wed, Jun 24 2020 9:10 AM

KCR Asks Bharat Ratna For PV Narasimha Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశ గతిని మార్చినవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు నేనే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొ న్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలచుకునేలా, చిరస్మరణీయంగా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాదంతా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

పీవీ జన్మదినమైన జూన్‌ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞాన భూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరిమితంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని, అదే రోజు దాదాపు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని, మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షిస్తారని సీఎం వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను బట్టి, నిధులు విడుదల చేసుకుంటూ పోతామన్నారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి సోమేశ్‌కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్‌ రావు, కుమార్తె వాణిదేవి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.ఉత్సవాల నిర్వహణలో భాగం గా చేయాల్సిన కార్యక్రమాలను సీఎం నిర్దేశించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
► యావత్‌ దేశ ప్రజలకు ఆయన గొప్పతనం చెప్పుకునేలా జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలను శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలి.  
► భారత పార్లమెంటులో పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరాలి.  
► రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ పెట్టిన విధంగానే హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్‌ ఏర్పాటు కావాలి. కేకే నేతృత్వంలోని కమిటీ రామేశ్వరం వెళ్లి వచ్చి, పీవీ మెమోరియల్‌ ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచించాలి.  
► వివిధ సందర్భాలకు సంబంధించిన పీవీ ఫొటోలను సేకరించాలి. వాటిని భద్రపరచాలి. ఫొటో ఎగ్జిబిషన్‌లు నిర్వహించాలి.  
► హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పీవీ కాంస్య విగ్రహాలను నెలకొల్పాలి.  
► రాష్ట్ర అసెంబ్లీలో పీవీ చిత్ర పటాన్ని పెట్టాలి. 
► పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయి. పీవీకి ముందు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? పీవీ తర్వాత ఎలా మారింది? అనే విషయాలను పొందుపరుస్తూ ప్రత్యేక సంచిక రావాలి.  
► పీవీ సర్వేల్‌లో పెట్టిన మొదటి రెసిడెన్షియల్‌ స్కూల్‌ దేశంలో గురుకులాల స్థాపనకు నాంది పలికింది. దేశ వ్యాప్తంగా నవోదయ పాఠశాలలను నెలకొల్పారు. ఇలా విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషిని వివరించేలా రచనలు చేయించాలి.  
► పీవీ గొప్ప సాహితీవేత్త. అనేక భాషలపై పట్టున్న పండితుడు. అనేక రచనలు చేశారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ రాసిన పుస్తకాలను పునర్ముద్రించాలి. అముద్రితంగా ఉన్న వాటిని అచ్చువేయాలి. వాటిని లైబ్రరీలకు, విద్యా సంస్థలకు, ప్రముఖులకు ఉచితంగా పంపిణీ చేయాలి. 
► విద్య, సాహిత్య, రాజకీయ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రత్యేకంగా గుర్తించడం కోసం పీవీ స్మారక అవార్డు నెలకొల్పాలి. క్రమం తప్పకుండా అవార్డులు ఇవ్వాలి.  
► రాష్ట్రంలోని ప్రతి ఊరికీ పీవీ గొప్పతనం తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు అందులో భాగస్వాములు కావాలి. 
► పీవీ తెలుగువాడు. తెలంగాణవాడు. జర్నలిస్టు. సాహితీవేత్త. కాబట్టి పీవీకి ఘనమైన అక్షర నివాళి అర్పించేలా రచయితలు ప్రత్యేక రచనలు చేయాలి. కవులు పాటలు రాయాలి. పత్రికలు ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాలి.

బిల్‌ క్లింటన్, జాన్‌ మేజర్‌ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, మంత్రులతో పీవీకి అనుబంధం ఉంది. వారి అభిప్రాయాలు కూడా సేకరించాలి. వీలయితే వారిని ఉత్సవాలలో భాగస్వాములను చేయాలి. 

పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వాతంత్య్ర సమరయోధుడుగా, రాజకీయ నాయకుడిగా, జర్నలిస్టుగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా ఆయన చేసిన కృషిని తెలిపేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక సావనీర్, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక సంచికలు రావాలి.

పీవీకి తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలతో, దేశ వ్యాప్తంగా అనేక మందితో అనుబంధం ఉంది. ప్రధానిగా, విదేశాంగ శాఖ మంత్రిగా సేవలందించడం వల్ల విదేశాల్లో కూడా ఆయనతో అనుబంధం కలిగిన వారున్నారు. పీవీ జయంతిని రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించాలి. 

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో పీవీకి ప్రత్యేక అనుబంధం ఉంది. వారిద్దరినీ కూడా భాగస్వాములను చేసేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement