ప్రతి రైతును ఆదుకుంటాం | KCR assured for every farmer for there crop failure | Sakshi
Sakshi News home page

ప్రతి రైతును ఆదుకుంటాం

Published Fri, Apr 24 2015 12:32 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

KCR assured for every farmer for there crop failure

- సీఎం కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు
- ఇది మన ప్రభుత్వం. న్యాయం చేస్తాం
- బాధితులకు మంత్రి హరీష్‌రావు హామీ
నంగునూరు:
అకాల వర్షం వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఎవరూ అధైర్యపడొద్దని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేట, బద్దిపడగ గ్రామాల్లో గురువారం మంత్రి పర్యటించి వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల మామిడి తోటలు, వరి పొలాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏ గ్రామాల్లో ఎంత మేరకు నష్టం వాటిల్లిందో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, రెవెన్యూశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మగ్ధుంపూర్, నంగునూరుతో పాటు కరీంనగర్ జిల్లా సరిహద్దులోని తమ తోటలకు నష్టం వాటిల్లిందని, తమను ఆదుకోవాలని రైతులు మంత్రికి మొరపెట్టుకున్నారు. బుధవారం అర్ధరాత్రి కురిసిన వానలతో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. లక్షలు ఖర్చు చేసి మామిడి తోటలు, వరి పొలాలు  కౌలుకు తీసుకున్నామని తమను ఆదుకోవాలని కౌలు రైతులు మంత్రిని కోరడంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి  పరిహారం చెరి సగం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

మాది రైతు ప్రభుత్వం
గత ప్రభుత్వాలు యాభై శాతం నష్టం జరిగితేనే పరిహారం అందజేసేవని, తాము అధికారంలోకి రాగానే 33 శాతం నష్టపోయినా ఇన్‌పుట్ సబ్సిడీ అందజేస్తున్నామని మంత్రి హరీష్‌రావు అన్నారు. బద్దిపడగలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు నష్టం జరగకుండా చూడాలని సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారన్నారు.

రైతులు అధైర్యపడొద్దని రెండు రోజుల్లో నష్టం వివరాలను సేకరించి ఖరీఫ్ సీజన్  ప్రారంభం కాకముందే ఎకరా వరికి రూ. 5,400, మామిడి తోటలకు ఎకరాకు రూ. 6,800 పరిహారం అందజేస్తామన్నారు. అధికారులు పారదర్శకంగా సర్వే చేపట్టి జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అతికించి ఒక్క రైతుకు కూడా నష్టం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం వ్యవసాయశాఖ కమిషన్ ప్రియదర్శిని, ఇన్సూరెన్స్ కమిషనర్ రాజేశ్వరితో ఫోనులో మాట్లాడి తెలంగాణలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.    

ఖరీఫ్‌కు ఎరువుల కొరత రానివ్వం
రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల కొరత ఉన్నప్పటికీ ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఎస్‌ఎఫ్ కొనుగోళు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ నిల్వ ఉంచేందుకు గిడ్డంగులు లేక కొనుగోళ్లు నిలిచిపోయాయన్నారు. గిడ్డంగుల్లో ఉన్న పత్తి నిల్వలను తరలించి పొద్దుతిరుగుడు పంటను హుజురాబాద్‌లోని గిడ్డంగిలో నిల్వ ఉంచేలా చూడాలని కమిషనర్ ఆదేశించామన్నారు.  ఖరీఫ్ సీజన్‌లోగా ఎరువులు తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు.

ఆయన వెంట వ్యవసాయశాఖ జూయింట్ డెరైక్టర్ హుక్యానాయక్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ బాల్‌రాజు, జెడ్పీవైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్‌గౌడ్, ఎడ్ల సోమిరెడ్డి, సర్పంచ్ గిరిజ, మంజుల, నాయకులు దువ్వల మల్లయ్య, పురేందర్, వెంకట్‌రెడ్డి, తిరుపతి, జయపాల్‌రెడ్డి, వెంకట్రాజం, బి కృష్ణారెడ్డి, అధికారులు ప్రభాకర్, శ్రీహరి, మోహన్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement