
ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం మూడు గంటల పాటు జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలు, సమావేశాల తేదీలపై చర్చ జరిగింది.
హోంశాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మిషన్ భగీరథలో 480 పోస్టులు, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో 360 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, తాజా పరిస్థితిపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 7,800 కోట్ల రూపాయలు బ్యాంక్ రుణం తీసుకోవాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల్లో మైనార్టీల రిజర్వేషన్ల బిల్లును ప్రవేశ పెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రాజీవ్ సాగర్, ఇంద్ర సాగర్ ప్రాజెక్ట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నాయిని అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ: జైళ్లల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.