కేసీఆర్‌ది ఊసరవెల్లి నైజం: పొన్నాల ధ్వజం
- రైతన్నల ఆత్మహత్యలపై కేంద్ర ప్రకటన దారుణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించి, ఆర్‌ఎఫ్‌సీ చైర్మన్ సీహెచ్ రామోజీరావుతో సమావేశం కావడంపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తనదైన శైలిలో స్పందించారు. కొన్ని అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఊసరవెల్లులు కూడా సిగ్గు పడతాయన్నారు.
ఈ భేటీ అంశాన్ని, గతంలో రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామని కేసీఆర్ పేర్కొన్న విషయాన్ని మీడియా ప్రతినిధులు శనివారం గాంధీభవన్‌లో ప్రస్తావించినపుడు సీఎం అక్కడ ఎన్ని గంటలున్నారో తెలియదని పొన్నాల బదులిచ్చారు. రాష్ట్రంలో 69 మంది రైతులే ఆత్మహత్యలు చేసుకున్నారంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి మోహన్‌భాయ్ కుంధేరియా సమాధానమివ్వడం దారుణమన్నారు. తెలంగాణ రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. పార్లమెంట్‌నే బీజేపీ మోసం చేసిందన్నారు.
కేంద్రం ప్రకటించిన ఆత్మహత్యల వివరాలను బీజేపీ సమర్ధిస్తుందా అని పొన్నాల ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఆత్మహత్యల వివరాల నివేదిక లేకపోతే కాంగ్రెస్ తరఫున తాము అందజేస్తామని సూచించారు. దాదాపు 500 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తుంటే కేంద్రమంత్రి ఇటువంటి సమాధానం ఇవ్వడం సరైంది కాదన్నారు.
స్వచ్ఛందసంఘాలు సేకరించిన వివరాలతో నివేదికను రూపొందించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాకుండా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా క్షేత్రస్థాయిలో సరైన నివేదికను కేంద్రానికి ఇస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల19-21 తేదీల మధ్య ఎల్‌బీస్టేడియంలో జరగనున్న అంతర్ జిల్లా బాలికల, బాలుర కబడ్డీ పోటీల పోస్టర్‌ను పొన్నాల లక్ష్మయ్య గాంధీభవన్‌లో విడుదలచేశారు.