
సాక్షి, మహబూబ్‌నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు గురువారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథక పనులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. కరివెన రిజర్వాయర్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన ఆయన ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇక ప్రాజెక్టు పరిధిలో ప్యాకేజీల వారీగా పనుల పురోగతి.. అడ్డంకులు.. సమస్యలను తెలుసుకునేందుకు ఆయన రోజంతా ఉమ్మడి జిల్లాలో గడపనున్నారు. సర్కిల్–1 పరిధిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల వద్ద పనులను ఆయన పర్యవేక్షిస్తారు. సీఎం కేసీఆర్ సాయంత్రం వరకు సుమారు ఎనిమిది గంటల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. కాగా వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలోని పది లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
అలాగే వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుల వద్ద క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం 2గంటల నుంచి 5:30గంటల వరకు సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటి వరకు విడుదలైన నిధులు.. అయిన ఖర్చు, బిల్లుల పెండింగ్ అంశాలను సమీక్షలో చర్చకొచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల అధికారులందరూ సమగ్ర నివేదికలు సిద్ధం చేసుకున్నారు.