కేసీఆర్ కిట్ ‘కిరికిరి..’
► టీఆర్‌ఎస్, టీడీపీ వాగ్వాదం
►బాలింతలను ఎండలో ఎంతసేపు..: పిడమర్తి రవి
►బజార్ రౌడీల్లా చిల్లరగా వ్యవహరించారు: ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం బాలింతల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల పంపిణీ ఖమ్మం జిల్లాలో రాజకీయ దుమారం రేపింది. అధికార టీఆర్‌ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదంతో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా సత్తుపల్లి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ పంపిణీ చేసేందుకు అధి కారులు ఉదయం 9 గంటలకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో మంత్రి పర్యటన రద్దు కావటంతో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు నేతృత్వంలో కార్యక్రమం చేపట్టాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది.
కార్యక్రమ సమాచారాన్ని ఆస్పత్రి సిబ్బంది ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అందించగా, ఆయన రావాల్సి ఉంది. ఈ క్రమంలో పిడమర్తి రవి ‘ఎమ్మెల్యే కల్లూరు ప్రభుత్వాస్పత్రిలో కిట్ల పంపిణీలో ఉన్నారు.. ఆయన వచ్చిందాక ఆగం.. ఎండలో బాలింతలను ఎంతసేపు కూర్చోబెడతారు.. మీకు చేతకాకపోతే నేనే పంపిణీ చేస్తానని’అంటూ కిట్లు పంపిణీ చేశారు. దీంతో ఎమ్మెల్యే లేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ అక్కడ ఉన్న టీడీపీ నాయకులు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్, టీడీపీ వర్గీయుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకొని టీడీపీ నాయకులను పక్కకు పంపించారు దీంతో ఎమ్మెల్యే సండ్ర టీఆర్‌ఎస్ నేతలు బజారు రౌడీల్లా వ్యవహరించారన్నారు.