కేసీఆర్‌ను కలిసిన ఇంటెలిజెన్స్ ఐజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ నూతనంగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ విభాగం పనితీరుపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. శివధర్‌రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా కేసీఆర్‌ను కలిశారు.
కొనసాగుతున్న అభినందనలు: కేసీఆర్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం టీఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాల నేతలు, జిల్లాల నుంచి వచ్చిన ప్రజలతో జనసంద్రాన్ని తలపిస్తోంది. శుక్రవారం పలు న్యూస్ చానళ్ల సీఈఓలు, అప్పా డెరైక్టర్ మాలకొండయ్య, సైబరాబాద్ పోలీసు కమిషనర్, పలు జోన్‌ల డీసీపీలు, పరిశ్రమల యజమానులు, వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం నాయకులు, మౌళిక పెట్టుబడుల శాఖ కార్యదర్శి కృష్ణబాబు, వికలాంగుల సంఘం నేతలు, బాలల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు, ఫ్యాప్సీ సభ్యులు కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.