అంబేడ్కర్.. దేశం గర్వించే మేధావి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశం గర్వించదగ్గ ప్రపంచస్థాయి మేధావి అని సీఎం కె.చంద్రశేఖరరావు కొనియాడారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ తన జీవితం, వ్యక్తిత్వం ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నివాళులర్పించారు. మంగళవారం(ఈ నెల 14న) అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. సమాజంలోని అంతరాలను తొలగించడానికి, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి అవసరమైన మార్గాన్ని అంబే డ్కర్ నిర్దేశించారన్నారు.
జయంతి ఉత్సవాల్లో గవర్నర్, సీఎం: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి మంగళవారం ఉదయం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రులు, మంత్రులు ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు, దళితరత్న అవార్డు ప్రదానం ఉంటాయని ఉత్సవాల కమిటీ తెలియజేసింది.