మూర్తి కాదు స్ఫూర్తి ముఖ్యం
విశ్లేషణ
ఏటా ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహిం చుకుంటున్నాం. ఆయన 125వ జయంతి ఉత్సవాలు ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలో జరగటం మంచి పరిణామం. ప్రధాని నరేంద్రమోదీ అంబేడ్కర్ స్వస్థ లంలో ఉత్సవాలు నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే, అంబేడ్కర్ ఆలోచనా విధానం ఎలాంటిది ? నేడు జరుగుతున్న దేమిటి? అంబేడ్కర్ జయంతి పేరుతో మోదీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పటాటోపం ఆయన ఆశయాలను ప్రతిబింబించేదిగా ఉందా? అంబేడ్కర్ నిరాడంబరుడు. మానవత్వానికి మారుపేరు. జీవితంలో అన్ని దశలలోను దళితునిగా వివక్షను ఎదుర్కొన్నారు. హిందూమత సంప్రదాయాలు, సంస్కృతి, కులోన్మాదం అనేక సందర్భాలలో ఆయనను మానసిక వ్యథకు గురిచేశాయి. అయినా స్వయంకృషితో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందగలిగారు. మన దేశానికి ‘సర్వసత్తాక ప్రజాస్వామిక’ స్ఫూర్తిగల రాజ్యాంగాన్ని రచించారు.
ప్రాథమిక హక్కుల పరిరక్షణ, పదేళ్లలో అందరికీ విద్య, ఆరోగ్యం, గృహవసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం, దళితులకు ప్రజాప్రాతినిధ్యంలోనూ, ఉద్యోగ తదితర రంగాలలోనూ రిజర్వేషన్‌ల రూపకల్పన వంటివన్నీ అంబేడ్కర్ ఆలోచనలే. కాని రాజ్యాంగ సూత్రాలను చిత్తశుద్ధితో అమలు పరచడంలో పాలకులు విఫలమైనారు. కిందిస్థాయి గ్రామీణ దళిత నిరుపేద బ్రతుకు చితికిపోతున్నది. సంక్షేమ పథకాల అమలు క్రిందిస్థాయికి 1/4 శాతం కూడా చేరడంలేదు. 67 ఏళ్ల రాజ్యాంగ అమలు మూడడుగులు ముందుకు, ఆరడగులు వెనక్కు తీరుగా ఉన్నది. బౌద్ధం వైపు ఆకర్షితుడవడానికి కారణం- ఆయన కులమతాలకతీతమైన సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షించారు. కానీ ఇప్పటికీ ఆ కల నెరవేరలేదు. సామాజిక న్యాయం పగటి కలగానే మిగిలింది. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ జయంతి ఆర్భాటం చూశాం.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, చోటామోటా నాయకులందరూ అంబేడ్కర్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ఒక తంతుగా మారింది. ప్రధాని నాగ్‌పూర్ వెళ్లి అంబేడ్కర్ స్వస్థలంలో కొంగజపం చేయడాన్ని సమాజం అంగీకరించదు. అసలు హిందూమతంలోని ఛాందసాన్ని ఖండించగల ధైర్యం ఆయనకుందా? గతంలో కాంగ్రెస్ అంబేడ్కర్‌ను చిన్నచూపు చూసిందనీ, తాము గౌరవిస్తున్నామనీ ఆయన చెప్పుకున్నారు. మరి, అంబేడ్కర్ పేరుతో ఉన్న విద్యార్థి సంఘం సభ్యులు ఆయన పాలనలోనే హెచ్‌సీయూ నుంచి ఎందుకు బహిష్కరణకు గురైనట్టు? దళిత విద్యార్థి రోహిత్ వేములను మనోవ్యధకు గురిచేసి ఆత్మహత్యకు పురికొల్పిన వారిని ఎందుకు రక్షిస్తున్నారు? రాజ్యాంగానికే రక్షణ లేని పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారు?
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా అంబేడ్కర్ ఆర్టికల్ 2లో పేర్కొనడం తెలంగాణ అవతరించడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అంబే డ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు పూనుకోవడం ప్రజలను నమ్మించడానికి మంచి ఉపాయమే. ఇందుకు తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ, బాబాసాహెబ్ ఆలోచనా విధానాన్ని అనుసరించాలి కదా? అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు సైతం అమలు కావడం లేదన్నది వాస్తవం కాదా? సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు, పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి జపం చేస్తున్నది.
ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న దళితులకు 3 ఎకరాల భూమి అమలు ఎంత శాతం పూర్తయింది? సామాజిక న్యాయం పట్ల పాలకుల వైఖరేమిటి? అంబేడ్కర్ భావజాలం మీద నిజంగా గౌరవం ఉంటే బలమైన పునాదుల మీద ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలి. నేడు ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేస్తూ రాచరిక పోకడలకు ఊతమిస్తున్నారు. కేసీఆర్ ఆలోచన ఏదైనా కొత్తదనంతో, కొత్త ఊపుతో ఉంటుంది. పుస్తకప్రియుడనీ, వక్త అని పేరుండటం సంతోషమే. ఆయన రాజ్యాంగం అసలు ఆశయాన్ని ఆకళింపు చేసుకొని వ్యవస్థలోని రుగ్మతలను పారదోలడానికి పూనుకోవడం ద్వారా మాత్రమే 125 అడుగుల ఎత్తై విగ్రహావిష్కరణ ఆలోచనకు అర్థం, పరమార్థం ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల పేరుతో సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయమందించారు. దళితుల అభ్యున్నతే తన లక్ష్యంగా ప్రకటించారు.
కానీ, ప్రతిపక్షాల మనుగడ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయి, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కావడం కేసీఆర్‌కు ఆమోదయోగ్యంగా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక విపక్షాన్ని ఫిరాయింపుల ద్వారా నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను పోగొట్టుకొన్న తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో రాబట్టుకోవాలని చూస్తోంది. ప్రతిపక్షాలకు తావులేని, వాటిని గుర్తించని ప్రజాస్వామ్యం రాచరిక ప్రజాస్వామ్యమవుతుంది. అది నియంతృత్వ పోకడలకు దారి తీయడం సహజం. అపరిమిత అధికారం నియంతృత్వానికి దారి తీస్తుందని అంబేడ్కరే చెప్పారు. ఇద్దరు చంద్రులు, ప్రధాని మోదీ అపర అంబేడ్కరులమని మురిసిపోతున్నారు. పాలకులు, నేతలు ఎవరైనా అంబేడ్కర్ కలలుకన్న స్వామ్యవాద విధానాలను అమలు చేసి చూపించినప్పుడే ఆయనకు నిజమైన వారసులు కాగలరు. ఎన్ని విగ్రహాలు పెట్టాం, ఎంత ఎత్తై విగ్రహాన్ని ప్రతిష్టించామని లెక్కలు వేసుకోవడం కంటే, పేదరికం లేని, కులమతాలకు అతీతమైన వ్యవస్థను నిర్మించినప్పుడే అంబేడ్కర్ కలసాకారమవుతుంది.
చాడ వెంకటరెడ్డి,
(వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి)