
ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటాం: కేసీఆర్
తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇక్రిమెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీయిచ్చారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇక్రిమెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీయిచ్చారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత సచివాలయానికి వచ్చిన ఆయన ఉద్యోగులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగులకు వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. పెండింగ్ లో పీఆర్సీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామన్నారు. ఉద్యోగులకు నిబంధనలను సరళీకృతం చేస్తామన్నారు. ఆశించిన ప్రగతి సాధించాలంటే ఉద్యోగులతో స్నేహంగా మెలగాలన్నారు. కలిసిమెలిసి ముందుకు సాగుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో మనవైపు చూస్తున్నారని చెప్పారు. సచివాలయ ఉద్యోగులందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.